Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం
- పీపుల్స్ మార్చ్‌తో రాష్ట్ర సర్కారులో కదలిక
- ఖాళీ పోస్టులు భర్తీ చేసేంత వరకూ నా అడుగులు ఆగవు : భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ముదిగొండ
ప్రజలపై పన్నుల భారం మరింతగా మోపడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ చార్జీలు పెంచాడని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీఎల్పీ నేత విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని యలగొండస్వామి దేవాలయం నుంచి ప్రారంభించారు. తొలిత దేవాలయంలో విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మపేట, వల్లాపురం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో భట్టి మాట్లాడారు. కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.. కిలో మంచి నూనె ప్యాకెట్ ధర రూ.220 ఎగబాకితే పేదలు బతికేది ఎట్లాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన పీపుల్స్ మార్చ్‌లో వచ్చిన ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. నకిలీ విత్తనాల అక్రమార్కులపై
పీడీయాక్ట్ కేసులు పెట్టాలని, పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులను సీఎం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా, ఉద్యోగ నోటిఫికేషన్, సొంత ఇంటిజాగా ఉన్నవారికి రూ.3లక్షలు.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని వివరించారు. అనంతరం మధిర పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల బడ్డీకొట్లు అధికారులు తొలగించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరుతూ.. అమ్మపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం, మధిర అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, సీపీఐ(ఎం) మధిర పట్టణ అధ్యక్షులు తేలప్రోలు రాధాకృష్ణ, సీపీఐ నాయకులు బెజవాడ రవిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, కాంగ్రెస్ మధిర పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ, ఐఎన్టీయూసీ మధిర పట్టణ అధ్యక్షులు కోరంపల్లి చంటి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచే జిల్లా కలెక్టర్‌కు భట్టి ఫోన్ చేసి సమస్య గురించి చర్చించారు. చిరు వ్యాపారులకు మరో చోట ప్రత్యామ్నాయం కల్పించే వరకు ఇప్పుడున్న చోటనే బడ్డీకొట్లు నడిపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కలెక్టర్ అంగీకరించినట్టు భట్టీ తెలిపారు. కాగా, ముదిగొండ మండలంలో పాదయాత్ర ముగిసి చింతకాని మండలంలోకి ప్రవేశించింది.
25 గ్రామపంచాయతీల్లో 7 రోజులపాటు 108 కిలోమీటర్లు మేర భట్టి పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో అమ్మఫౌండేషన్ అధ్యక్షులు మల్లు నందిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్,పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, అమ్మపేట గ్రామసర్పంచ్ వడ్డెల్లి భుబెశ్వరి, వల్లాపురం ఎంపీటీసీ తాటికొండ విజయ, తదితరులు పాల్గొన్నారు.