Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారవంతమైన భూములిచ్చేందుకు రైతుల నిరాకరణ
- నేడు మరోమారు ప్రజాభిప్రాయ సేకరణ
- ఈ రహదారితో కేంద్రమంత్రి గడ్కరీ, అదానీలకే ప్రయోజనం
- ఖమ్మం నగర విస్తరణకు ఆటంకం కానున్న జాతీయ రహదారి
- నాగపూర్ టూ అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూ సేకరణ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్రలోని నాగపూర్ పార్లమెంటరీ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూములిచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. మచిలీపట్నం ఫోర్ట్‌ను హస్తగతం చేసుకున్న కార్పొరేట్ దిగ్గజం అదానీ ప్రయోజనం కోసం నిర్మించే ఈ హైవే ఏ ఒక్కచోటా ఇప్పటికే ఉన్న రహదారులను అనుసరించదు. కేవలం పంట చేల మీదుగా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించి తదనుగుణంగా భూ సేకరణ చేసేందుకు గెజిట్‌ను కూడా విడుదల చేశారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మీదుగా కృష్ణా జిల్లా అమరావతి వరకు దీన్ని నిర్మిస్తారు. ఈ రహదారి మూలంగా వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, విలువైన ఆస్తులు, ఇండ్ల స్థలాలు, భూనిక్షేపాలను నిర్వాసితులు కోల్పోవాల్సి ఉంటుంది. అటువంటి ఈ రహదారి మాకొద్దంటూ ఈనెల 15వ తేదీన మధిర మండలం సిరిపురంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అయినా కేంద్రం పట్టువిడవకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూనే ఉంది. రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో శనివారం మరోమారు ప్రజాభిప్రాయ సేకరణకు సమాయత్తం అయింది. జాయింట్ కలెక్టర్ మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అభిప్రాయ సేకరణకు కూడా ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో 107 కి.మీలు.. 2000 ఎకరాలు...
ఈ రహదారి నిర్మాణం కోసం 2019 జూన్ (మొదటిపేజి తరువాయి)
27 నుంచి భూ సేకరణ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు ప్రతిఘటిస్తున్నా ప్రభుత్వం పట్టువిడుపు లేకుండా వ్యవహరిస్తోంది. రూ.కోట్లలో భూముల విలువలుంటే రూ.25 లక్షల మేర మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. ఖమ్మం జిల్లాలో 106.68 కి.మీ మేర నిర్మించే ఈ రహదారితో సుమారు 2000 ఎకరాల భూములను రైతులు కోల్పోవాల్సి ఉంటుంది.
జిల్లాలో ఖమ్మం రూరల్ మండలం తీర్థాల నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు రఘునాథపాలెం, కొణిజర్ల, వైరారూరల్, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. గెజిట్‌లో సూచించిన ప్రకారం ఈ రహదారి నిర్మిస్తే ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు, బైరెటీస్, గ్రానైట్ వంటి విలువైన ఖనిజ నిక్షేపాలు, నగరం ఎటూ పది కి.మీ పైగా విస్తరించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు చిరుద్యోగులు కొనుగోలు చేసిన ప్లాట్లను కోల్పోక తప్పదు.
ఖమ్మం నగర విస్తరణకూ ఆటంకం
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ద్వారా ఖమ్మం నగర విస్తరణకూ ఆటంకం ఏర్పడనుంది. నగరానికి పది కి.మీ దూరంలోని వి.వెంకటాయపాలెం సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ ఈ రోడ్డుకు ఆవల అవుతుండటంతో రాకపోకలకు ఆటంకం కలగనుంది. నగర విస్తరణకూ అవకాశం లేకుండా పోతుంది. పైగా నగరం చుట్టుపక్కల సేకరించే భూములన్నీ కూడా ఉద్యాన పంటలకు నెలవు కావడంతో కూరగాయల కొరత ఏర్పడుతుంది. ఎకరం రూ.4 కోట్లు చేసే భూములకు ప్రభుత్వం అక్కడి రిజిస్ట్రేషన్ వాల్యుపై మూడు, నాలుగు రెట్లు అధికంగా ఇస్తామంటోంది. దీని ప్రకారం చూసినా రఘునాథపాలెంలో ఎకరం రూ.5 లక్షలు రిజిస్ట్రేషన్ విలువ ఉంది. ఎకరానికి రూ.25 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎకరం రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.25 లక్షలకు కాజేసేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది.
అలైన్మెంట్ మార్చాలి
ఇప్పటికే జిల్లా రైతుల నుంచి సూర్యాపేట-దేవరపల్లి జాతీయ రహదారికి కోదాడ- కొరవి రోడ్డు విస్తర్ణ కోసం భూములు సేకరించారు. ఇవికాక మూడో రైల్వేలైన్ నిర్మాణం కోసం కూడా మార్కింగ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం 2000 ఎకరాల భూములు తీసుకున్నారు. ఇలా ప్రాజెక్టులు, రోడ్ల కోసం విచ్చలవిడిగా అరకొర పరిహారంతో భూములు సేకరిస్తుండటంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం పంట పొలాల మీదుగా వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చి ప్రస్తుతం ఉన్న నూతనంగా నిర్మిస్తున్న రహదారులతో వీలైన మేరకు అనుసంధానం చేస్తూ నిర్మించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. పైగా గ్రీన్‌ఫీల్డ్ హైవేకు జిల్లా మొత్తంలో ఒక్కటే ఎంట్రీ, ఎగ్జిట్ ఇస్తుండటం కూడా అభివృద్ధికి ఆటంకం కానుందనే అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. రఘునాథపాలెం మండలం 218 సర్వేనంబర్‌లో ఇందిరమ్మ ఇండ్లు, వైఎస్ఆర్ నగర్ ఇండ్లస్థలాలను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రజలకు ఇన్నేసి నష్టాలు చేసే గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, కనీసం అలైన్మెంట్ మార్చి తక్కువ మొత్తంలో భూములు సేకరించాలని, సేకరించే భూములకు కూడా మార్కెట్ వాల్యు ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
పంటభూములు కోల్పోవడంతో పాటు పంటలకూ తీరని నష్టం
గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. పంట భూములు కోల్పోవడంతో పాటు ఎత్తుగా నిర్మించే ఈ హైవే వల్ల పర్యావరణానికి తీరని నష్టం. పంటనష్టాలు చోటు చేసుకుంటాయి. పంటలు దుమ్ముకొట్టుకుపోతాయి. కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్ వంటి వాయువులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి ఎన్నో నష్టాలున్న ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆపాలని శనివారం పర్యావరణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో చెబుతాం. బీజేపీ మినహా అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలుస్తున్నాయి.
- తక్కెళ్లపాటి భద్రయ్య, రైతు, రఘునాథపాలెం
జాతీయ ప్రాజెక్టులతో అభివృద్ధి
జాతీయ ప్రాజెక్టులతో అభివృద్ధి వేగవంతం అవుతుంది. భూములు పోతాయి కాబట్టి సహజంగానే రైతులు, నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాలి. పర్యావరణశాఖ నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో వెలువరించే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.
- వి.దుర్గాప్రసాద్, పీడీ, ఎన్హెచ్ఏఐ, ఖమ్మం