Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగాల అధికారులేరి?
- మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య ఆగ్రహం
- బోయిగూడ ఘటనా స్థలంలో పరిశీలన
- 11 మంది సజీవ దహనం అత్యంత బాధాకరమని ఆవేదన
నవతెలంగాణ-బేగంపేట్
''అగ్ని ప్రమాదం వల్ల 11 మంది వలస కార్మికులు సజీవ దహనం కావడం అత్యంత బాధాకరం. దీనిపై అన్ని కోణాల్లో విచారించాలి. ఇదెలా జరిగింది? ఇంతకీ ఎలక్ట్రిసిటీ, లేబర్, హెల్త్ డిపార్టుమెంట్ల అధికారులేది? ఆర్డీవోగారు? రాలేదా? ఇదేనా వారి చిత్తశుద్ధి? ఇదేం పద్ధతి'' అని మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బోయిగూడ ప్రమాద ఘటన స్థలాన్ని శుక్రవారం ఆయనతోపాటు ఏపీ అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ ఆర్డీవో వసంత కుమారి, సికింద్రాబాద్ రెవెన్యూ ఆఫీసర్ బాలశంకర్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ.. తాను వస్తున్నట్టు తెలిసి కూడా ఆ మూడు డిపార్టుమెంట్ల అధికారులు రాకపోవడంపై ఆర్డీవోను, అక్కడున్న అధికారులను ఆరా తీశారు. అనంతరం ఘటనా స్థలాన్ని మొత్తం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సరైన అనుమతుల్లేకుండా జనావాసాల్లో స్క్రాబ్ గోదాములకు అనుమతులు ఇవ్వడం సరికాదని, వెంటనే అలాంటి గోదాములపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నగరం మధ్యలో ఉన్న గోదాములను వెంటనే తొలగించాలన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే 11 మంది మృతిచెందినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రయ్య వచ్చిన సమయంలో కూడా అక్కడ పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేశారు.