Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వైఖరిని రైతులకు వివరిద్దాం...
- 'ధాన్యం కొనుగోళ్ల'పై మంత్రులతో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయంలో తెలంగాణ పట్ల మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరును రైతులకు విడమరిచి చెప్పాలని ఆయన మంత్రులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులు.. అక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించిన విషయం తెలిసిందే. ఆ చర్చల సారాంశాన్ని వివరించేందుకు వారు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ... 'ధాన్యంపై తదుపరి కార్యాచరణకు రూపకల్పన చేద్దాం. వడ్లను కొనటానికి సంబంధించి కేంద్రం మొండి వైఖరిని అవలంభిస్తోంది. ఈ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతోంది. దీనిపై ప్రధాని మోడీతో నేనే స్వయంగా మరోసారి మాట్లాడతా. ప్రభుత్వ సూచనతో రైతులు యాసంగిలో వరి పంట సాగు చేయలేదు. అయితే అక్కడక్కడ కొంతమంది ఆ పంటను సాగు చేశారు. వారి వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించాలా..? వద్దా..? అనే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా...' అని చెప్పినట్టు సమాచారం. సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజరు తదితరులున్నారు.