Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ సోమ, మంగళవారాల్లో అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు కలిసి తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.బీఎస్ఎన్ఎల్, సింగరేణి,ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నదని తెలిపారు. కోవిడ్ సంక్షోభంతో ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి మోయలేని భారాలు వేస్తున్నదని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును తెచ్చి సబ్సిడీలకు కోత విధిస్తున్నదని తెలిపారు. ఉద్యోగులు, పింఛనర్లకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గించి పీఎఫ్‌పై పన్ను విధిస్తున్నదని తెలిపారు. విద్యా, వైద్య రంగాలను క్రమక్రమంగా కార్పొరేట్లకు ఆదాయ వనరులుగా మార్చి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నదని విమర్శించారు.ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న లక్షలాది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా వారిపై నయా వెట్టిచాకిరీ విధానాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు.