Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వత్రిక సమ్మెలో భాగస్వాములమవుదాం
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రలోని బీజేపీి సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సోమ, మంగళవారాల్లో జరుగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గిరిజనులు పాల్గొనాలనీ, తమ హక్కులకై ఉద్యమించాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని తెలిపారు. రాజ్యాంగం ద్వారా గిరిజనులకు సంక్రమించిన హక్కులను క్రమంగా కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో సామాజిక భద్రతకు విఘాతం ఏర్పడుతున్నదని తెలిపారు. కరోనా కారణంగా గిరిజన కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్యాయని పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు బడ్జెట్లో కనీస నిధులు కేటాయించలేదని విమర్శించారు. రేషన్ ద్వారా పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం ,చక్కెర, గోధుమలు వంటి వాటిలో సబ్సిడీలను ఎత్తేసి గిరిజనుల్లో ఆకలి చావులకు కారణమవుతున్నదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది గిరిజనులు, పేదలు లబ్ధిపొందుతున్నారనీ, ఆ చట్టానికి నిధుల్లో కోత పెట్టి పూర్తిగా ఎత్తివేసేందకు కుట్రపన్నుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూముల పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలను హక్కులు ఇవ్వకుండా అడవులను కార్పొరేట్ల కు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో గిరిజనులకు న్యాయబద్ధంగా రావలసిన సబ్ ప్లాన్ నిధులను కేటాయింపులు చేయకుండా వేల కోట్లను దారిమల్లిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు.