Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లితో కార్మికసంఘాల నేతల భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సోమ, మంగళవారాల్లో నిర్వహించబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ మద్దతివ్వాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు కోరాయి. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ను ఆ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలనీ, నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలనీ, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలనీ, అధిక ధరలను నియంత్రించాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, డిఫెన్స్, రైల్వే తదితర రంగాల్లోని ఫెడరేషన్లు కూడా సమ్మెలో భాగస్వాములవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సమ్మెకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు తెలియజేయాలనీ, పార్టీ యంత్రాంగాన్ని సమ్మెలోకి దించాలని కోరారు. సమ్మె తొలి రోజు మండల కేంద్రాల్లో, రెండో రోజు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రదర్శనలు, సభలు, వివిధ నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం కేసీఆరే స్వయంగా సమ్మెకు మద్ధతు ప్రకటన చేస్తారంటూ ఆయన చెప్పారని వెల్లడించారు. వినోద్ కుమార్ ను కలిసిన వారిలో వి.ఎస్.బోస్ (ఏఐటీయూసీ), పాలడుగు భాస్కర్ (సీఐటీయూ), రెబ్బా రామారావు (హెచ్ఎంఎస్), రూప్ సింగ్ (టీఆర్ఎస్కెవి), కె.సూర్యం (ఐఎఫ్ టీయూ) ఉన్నారు.