Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ భావాజాలంతో పనిచేయాల్నో నిర్దేశించుకోవాలి
- దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల ప్రారంభసభలో మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల వివక్ష రూపం మారిందనీ, దళిత జర్నలిస్టులు ఎక్కడో ఒకచోట..ఏదో రూపంలో వివక్షను ఎదుర్కొంటున్నారనీ, అందుకు తాము అతీతం కాదని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ మీడియా అకాడమీ, షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమయిన రాష్ట్ర దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక తప్పుడు భావాజాలం విస్తరిస్తున్న సమయంలో జర్నలిస్టులుగా మనం ఎటువైపు ఉన్నామో నిర్దేశించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఏ భావాజాలానికి వ్యతిరేకంగా వార్తలు రాయాలో నిర్ణయించుకోవాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు దళిత బంధు ఇస్తామనీ, ప్రతి నియోజక వర్గానికి మూడు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ను కేటాయించా రని చెప్పారు. అన్ని నియోజక వర్గాల శాసన సభ్యులతో సంప్రదించి అక్కడి జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మాట్లాడుతూ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో తప్ప మరెక్కడా దళిత జర్నలిస్టులు తనకు తారసపడలేదని చెప్పారు.ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న ప్రమాదకర ధోరణులపై ఉద్యమించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధోల్ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ అన్నారు.తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు ఎత్తేయాలనే తదితర అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా వార్తలు రాయాలని సూచించా రు.కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మెన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, దుర్గం చిన్నయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే, అకాడమి కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అంబేద్కర్ చిత్ర పటం లేకుండా జ్యోతి ప్రజ్వలనా?
దళిత జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ, ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ప్రారంభంలో తీవ్ర గందరగోళం, అయోమయం చోటు చేసుకున్నది. అడుగడుగునా నిర్వాహణా లోపాలు కనపడ్డాయి. దీంతో జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు. ఒక దశలో వారు మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణతో వాగ్వాదానికి దిగారు. వారిని నిలువరించలేక నిర్వహకులు చేతులెత్తేశారు. చివరకు ఎమ్మెల్యేల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రారంభ సూచకంగా మంత్రి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సందర్భంగా వేదికపై అంబేద్కర్ చిత్ర పటం లేకపోవటంపై జర్నలిస్టులు తమ నిరసన తెలియజేశారు. అంబేద్కర్ చిత్ర పటం తెచ్చేంత వరకు జ్యోతి ప్రజ్వలన చేయోద్దని ఒక్క పెట్టుగా జర్నలిస్టులు నినాదలు చేశారు. జైభీం, అంబేద్కర్‌కు జోహార్లంటూ నినదించారు. దీంతో అల్లం నారాయణ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంబేద్కర్ చిత్రపటం తెచ్చినా పూల దండ తేకపోవటంతో మరో సారి గందరగోళం ఏర్పడింది. దీంతో మంత్రి వేదికమీదనే గంటకు పైగా అచేతనంగా కూర్చొవాల్సి వచ్చింది.