Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు అంతంతే.. జీవితాలు చీకట్లోనే
- 45 ఇండియన్ లేబర్ కమిషన్ సిఫారసులు బుట్టదాఖలు
- పథకాల నిర్వీర్యం గ్రామీణ భారతానికి నష్టదాయకం
- దేశవ్యాప్త సమ్మెలోకి స్కీం వర్కర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఏ అభివృద్ధి పథకాన్ని అమలు చేసినా విజయవంతం చేసేది స్కీం వర్కర్లే. వీరిలో నూటికి 90 శాతం మహిళలే. పగలనకా, రాత్రనకా కష్టపడి ఆ ఫలాలను ప్రజలకందించి పాలకులకు పేరు తెచ్చేది వారే. దేశంలో అందరికీ కనీస వైద్యసదుపాయాలు అందేలా...పౌష్టికాహారం దక్కేలా చూసేది వీరే. కానీ, వారి జీవితాలు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. కనీస వేతనాలకు, వసతులకు నోచుకోకపోవడమే ఇందుకు కారణం. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వీరి బాగోగుల నుంచి పక్కకు తప్పుకున్నది. అదే సమయంలో పథకాల నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ వారి ఉపాధిపైనే పొట్టగొడుతున్నది. 45వ ఇండియన్ లేబర్ కమిషన్ వారిని కార్మికులుగా గుర్తించాలని కేంద్రానికి సూచించగా..దాన్ని బుట్టదాఖలు చేసింది. దీంతో మన దేశంలో కోటి మందికిపైగా, రాష్ట్రంలోని మూడులక్షలకు మంది వరకు ఉన్న స్కీం వర్కర్లు కార్మికులుగా గుర్తింపునకు నోచుకోలేకపోతున్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, సాక్షర భారతి, సర్వశిక్షాభియాన్, స్వచ్ఛకార్మికులు, 2వ ఏఎన్ఎం, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో కేజీబీవీ, కస్తూర్బా, తదితర రంగాల్లో వీరు పనిచేస్తున్నారు. వీరందరికీ అందుతున్నది అరకొర వేతనాలే. అంగన్వాడీలు రూ.13 వేలు పొందుతుండగా..మధ్యాహ్న భోజన కార్మికులు వెయ్యి రూపాయలనే పొందుతున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవవేతనాన్ని రూ.3 వేలకు పెంచింది. ఆ పెరిగి గౌరవ వేతనం వచ్చే బడ్జెట్ నుంచి అందనున్నది. అయితే, ఆ అరకొర పారితోషికమూ నాలుగైదు నెలలుగా పెండింగ్‌లో ఉంటుండటంతో మధ్యాహ్న బోజన కార్మికులు అప్పులు తెచ్చి పథకాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. స్వచ్ఛకార్మికులను పనిలో నుంచి తొలగించిన విషయం విదితమే. హెల్త్ రంగంలో వివిధ స్కీమ్‌లకు మంగళం పాడే పనికి పూనుకున్నది. ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్న స్కీమ్‌ల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని చూడటం గ్రామీణ భారతంపై తీవ్ర ప్రభావం పడనున్నది. మరోవైపు కార్మికకోడ్ల ప్రభావం స్కీం వర్కర్లపైనా పడనున్నది. ఈ కోడ్లతో సంఘం పెట్టుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. తమ వేతనాల కోసం సర్కారుతో బేరసారాలు ఆడే శక్తిని కోల్పోనున్నారు. హక్కులన్నీ కాలరాయబడతాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా, వాటి నిర్వహణను ప్రయివేటుకు అప్పగించకుండా దేశంలోని స్కీం వర్కర్లందరూ సోమ, మంగళవారాల్లో నిర్వహించబోయే సమ్మెలోకి వెళ్లనున్నారు.
కార్మికులుగా గుర్తించి రూ.26 వేల వేతనం ఇవ్వాలి : ఎస్వీ రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
ప్రభు త్వ పథకా ల్లో పనిచేస్తున్న స్కీం వర్క ర్లను కార్మికులు గా గుర్తించాలి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. 45వ ఇండియన్ లేబర్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి. పథకాలను ప్రయివేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. స్కీమ్‌లకు బడ్జెట్లకు కోతలు పెట్టొద్దు. పేదలకు ఎంతో ఇతోధికంగా ఉపయోగపడుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచాలి. ఈ డిమాండ్లతోనే సమ్మెలోకి వెళ్తున్నాం. ప్రభుత్వ పథకాలను కాపాడుకునేందుకు సమరశీల పోరాటాలు చేస్తాం.