Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రయివేటీకరణ
- విధానాలను తిప్పికొట్టేందుకే...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ విద్యుత్‌రంగ సంస్థల్లో పనిచేస్తున్న వివిధ రకాల ఉద్యోగులు, కార్మికులు, ఇంజినీర్ల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం 25 సంఘాలతో నూతనంగా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ఏర్పాటయ్యింది. విద్యుత్‌రంగాన్ని ప్రయివేటుపరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జేఏసీ పనిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. శనివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మెన్‌గా జీ సాయిబాబు (టీఈఈయూ-1104), కో చైర్మెన్‌గా ఇ శ్రీధర్ (టీఎస్‌ఈఈయూ-327), కన్వీనర్‌గా పి రత్నాకరరావు (టీఎస్‌పీఈఏ), కో కన్వీనర్‌గా పీ బీసిరెడ్డి (టీపీడీఈఏ) ఎన్నికయ్యారు. వైస్ చైర్మెన్లుగా ఎమ్ అనిల్‌కుమార్ (టీఎస్ఈఏఈఏ), ఎమ్ఏ వజీర్ (టీఎస్‌పీఈయూ-1535) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా వీ గోవర్థన్ (టీఎస్‌యూఈఈయూ-సీఐటీయూ), డి శ్యాంమనోహర్ (టీఎస్ఈఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఏ), ఎమ్ వెంకన్నగౌడ్ (టీఈబీసీఈడబ్ల్యూఏ), ఆర్ సుధాకర్‌రెడ్డి (టీఈఓసీఈడబ్ల్యూఏ), ఎమ్ రాంజీ (ఎస్టీఈడబ్ల్యూఏ), ఎమ్ తులసీనాగరాణి (ఈడబ్ల్యూడబ్ల్యూఏ) ఎన్నికయ్యారు. కార్యవర్గంలో మరిన్ని సంఘాల నాయకులు ఉన్నారు. శనివారం నూతన కార్యవర్గం టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావును విద్యుత్‌సౌధలో కలిశారు.
పే రివిజన్ కమిటీ వేయండి
విద్యుత్ ఉద్యోగుల పే రివిజన్-2022కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు సీఎమ్డీని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావల్సి ఉందనీ, అయితే దీనిపై కసరత్తును మరింత వేగవంతం చేయాలని వారు కోరారు. దీనికి సీఎమ్‌డీ సానుకూలంగా స్పందించినట్టు జేఏసీ నేతలు తెలిపారు. త్వరలో పే రివిజన్ సంప్రదింపుల కమిటీని నియమిస్తామని హామీ ఇచ్చినట్టు వివరించారు.
సమ్మెకు మద్దతుగా భోజన విరామ నిరసనలు
కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఎస్పీఈజేఏసీ మద్దతు తెలిపింది. సమ్మె రోజుల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో రాష్ట్రంలోని అన్ని విద్యుదుత్పత్తి కేంద్రాలు, సర్కిల్ కార్యాలయాల్లో సామూహిక ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావుకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్టు జేఏసీ కన్వీనర్ పి రత్నాకరరావు తెలిపారు.