Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యపోరాటాలతో ముందుకెళ్తాం..దేశాన్ని రక్షించుకుంటాం
కార్మిక కోడ్లను తిప్పికొడతాం
- దేశ సంపదను అమ్మేయడం దేశభక్తి ఎట్టా అవుతుంది మోడీజీ?
- బీజేపీ నేతల్లారా ! రోజుకు రూ.178తో ఎట్ట బతుకుతరో చూపెట్టండి
- గుర్తుపెట్టుకోండి...మతం ఎల్లకాలం రక్షించలేదు
- రెండు రోజుల సమ్మెతో కేంద్రానికి గట్టి బుద్ది చెబుతాం: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
'మాది దేశభక్తియుత సమ్మె. ఓ పక్క ఉద్యోగ భద్రతకే ఎసరొచ్చాక ఒకటెండ్రు రోజుల వేతనాల గురించి ఆలోచించే పరిస్థితి కార్మికుల్లో లేదు. కార్మిక సంఘాలన్నింటితో కలిసి ఐక్యపోరాటాల ద్వారా ముందుకెళ్తున్నాం. కార్మిక కోడ్లను తిప్పికొడతాం. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటాం. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న స్వదేశీ జపం కొంగ జపం లాంటింది. దేశ సంపదను అమ్మేయడం దేశభక్తి ఎట్టవుతుంది? మతం, కులం, స్వదేశీ, తదితర భావోద్వేగాలతో రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వారిది ఎల్లకాలం నడవదు. ప్రజలు గ్రహిస్తున్నారు. వారికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడుతున్నాయి. దేశభక్తి ముసుగులో ప్రజల్ని వంచిస్తున్న వారి తీరును ఎండగడుతాం. ప్రజల్ని చైతన్య పరుస్తాం. దేశ సంపదను కాపాడుకుంటాం. దీంతోనే ఆగం. మోడీ సర్కారు కార్మిక కోడ్ల నుంచి వెనక్కి తగ్గేదాకా, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడే దాకా ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటాం. విజయం సాధిస్తాం' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్త సమ్మె తలపెట్టిన నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్మిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలేంటి?
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు అంబానీ, అదాని, టాటా, తదితర కార్పొరేట్ల లాభాలు పెంచటం, సంపద పోగేసుకునేలా లబ్ది చేకూర్చడం కోసం మోడీసర్కారు తీసుకొచ్చిన కార్మికకోడ్‌లు కార్మికులను కట్టుబానిస లుగా మార్చనున్నాయి. పరిశ్రమలో సంఘం పెట్టుకునే హక్కునే కేంద్రం కాలరాసింది. సంఘం లేకపోతే హక్కులు, వేతనాల కోసం ప్రశ్నించే
పరిస్థితే ఉండదు. రోజు కూలి రూ.178 అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కార్పొరేట్ సంస్థల ఒత్తిడి మేరకు తీసుకున్న నిర్ణయమే. ఈ లెక్కన 31 రోజులు కష్టపడ్డా చేతికి రూ.5200 రావు. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో ఆ వేతనంతో బతకటం ఎలా సాధ్యమవుతుంది? ఆ వేతనంతో బీజేపీ నేతల కుటుంబాలు ఒక నెల గడపాలని సవాల్ విసురుతున్నా. సిద్ధమేనా? బీజేపీ సర్కారు విధానాలతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి. విద్యావైద్యం ఆ కుటుంబాలకు దూరమవుతున్న దుస్థితి. కొట్లాడి సాధించుకున్న 8 గంటల పనివిధానం స్థానంలో 12 గంటల పనివిధానం తేవడం దారుణాతిదారుణం. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని దీన్ని అమలు చేస్తున్నాయి. సామాజికభద్రతకు నష్టం వాటిల్లుతున్నది. గంటల చొప్పున పనిచేయించుకునే విధానానికి అనుమతివ్వడం దారుణం. కోడ్‌లలోని అంశాలన్నీ కార్మికులకు నష్టం చేకూర్చేవే.
దేశం కోసమే ఎన్ఎంపీ తెచ్చామని మోడీ సర్కారు అంటున్నది...మీరేమో అది దేశద్రోహ చర్య అంటున్నారు? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కాస్త వివరించండి?
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ) ముమ్మాటి దేశద్రోహ చర్యనే. రూ.6 లక్షల కోట్ల ఆదాయం కోసం కోట్లాది మంది కార్మికులకు, ఉద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కారుచౌకగా అమ్మేయటం దుర్మార్గం కాదా? దేశ రక్షణకు మూలస్తంభాలైన డిఫెన్స్ రంగ పరిశ్రమలను బహుళ జాతి, విదేశీ పరిశ్రమల చేతుల్లో పెట్టడం దేశద్రోహ కాక దేశభక్తి ఎట్టవుతుంది? ఇది దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమే. ప్రభుత్వ రంగ సంస్థల భూములను అమ్మేందుకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థల యజమానులను బోర్డు సభ్యులుగా నియమిస్తరంట. ఆ సంస్థల భూములను కారుచౌకగా కొట్టేసే కుట్ర ఇది. ఎన్ఎంపీ ద్వారా 30 ఏండ్లకు ప్రభుత్వ రంగ సంస్థలను లీజుకు ఇస్తరంట. అవసరమైతే మరో 30 ఏండ్లు పొడిగిస్తరంట. ఒక కంపెనీ పరికరాలను 60 ఏండ్లు వాడుకున్న తర్వాత అవి పనికొస్తవా? వాటిపై ఆధారపడి బతుకున్న కార్మికుల ఉద్యోగ భద్రం ఏం కావాలి?కరెంటు తయారీని కూడా ప్రయివేటోల్లకు ఇచ్చేస్తరంట. అట్లయితే మళ్లీ ఆముదం బుడ్లకింద బతుకాల్సిన రోజులొస్తరు. మిగతా రవాణా రంగం ద్వారా ప్రయాణించే చార్జీలతో పోలిస్తే రైలు చార్జీలు 20, 30 శాతం కూడా ఉండవు. ఇప్పుడు 400 రైల్వేస్టేషన్లు, 150 రైళ్లను మోడీ సర్కారు ప్రయివేటు శక్తులకు అప్పగించింది. ఐదు, పది రూపాయలున్న ప్లాట్ఫారం టికెట్ ధర రూ.50 అయింది. పార్కింగ్ ఫీజు రోజుకు రూ.300 నుంచి 400 దాకా వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. 8 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను ప్రయివేటు నిర్వాహకులకు అప్పగిస్తారంట. ఇప్పటికే అక్కడక్కడ ఉన్న టోల్గేట్ల వద్దనే చార్జీలు కట్టలేక తలలు బాదుకుంటున్నాం. పూర్తిగా ప్రయివేటోళ్లకు ఇస్తే అడుగడుగునా అవి పుట్టుకొస్తాయి. సామాన్యులు రోడ్డెక్కాలంటే దడుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కటేమిటి? హైడ్రల్, సోలార్, వాయుశక్తి, గ్యాస్‌పైపులైన్, క్రీడా మైదానాలను, ఇలా దొరికినవాటినన్నింటినీ అమ్మేసుకుంటూ పోవడమంటే దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనురిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. విజయం సాధిస్తాం.
మీరేమో విజయం సాధిస్తామంటున్నారు..అన్నిచోట్లా వాళ్లు గెలుస్తూ పోతున్నారు...దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?
కార్మికులంతా ఇప్పటిదాకా జీతాలు, హక్కుల కోసం ఐక్యంగా కొట్లాడుతున్నారు. పాలకవర్గాలేమో కులం, మతం, ప్రాంతం పేరుతో కార్మికులను విభజిస్తున్నాయి. దీంతో ఇంటికెళ్లాక ఎవరి పార్టీవారిదే. ఎవరి కండువా వారిదే. చివరకు తమ హక్కులకు ఎసరు తెచ్చే పార్టీల జెండాలను కూడా కార్మికులు మోస్తున్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ బీజేపీ భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నది. దీనికి కార్పొరేట్ శక్తులు కూడా ఊతంగా నిలుస్తున్నాయి. అధికారం చేతికి చిక్కగానే యథావిధిగా కార్పొరేట్ల కోసం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. జీవనాధారంపై దెబ్బకొడుతున్న బీజేపీ తీరును పసిగట్టిన కార్మికులు తమ సంస్థలను రక్షించుకునేందుకు పోరాటాల్లోకి వస్తున్నారు. కార్మికుల్లో రాజకీయ చైతన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది. మతం, కులం, భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలో ఉండటం ఎల్లకాలం సాగదు. కచ్చితంగా బీజేపీ సర్కారుకు ప్రజలు, కార్మికులు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
సమ్మె ప్రధాన డిమాండ్లేంటి?
లేబర్కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. దేశంలోని సహజ వనరులను పరిరక్షించాలి. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్లను ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ పనులను పట్టణాలకు విస్తరించాలి. సంయుక్త కిసాన్ మోర్చా అందించిన ఆరు సూత్రాల చార్టర్ ఆఫ్ డిమాండ్లను అమల్లో పెట్టాలి.పెట్రోల్ ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ధరలను నియంత్రించాలి. నిత్యావసర ధరలను కట్టడిచేయాలి. అత్యవసర రక్షణ సేవల చట్టం రద్దు చేయాలి. మోడీ సర్కారు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి.
సమ్మె జయప్రదం కోసం ఇప్పటిదాకా జరిగిన కృషేంటి?
ఒక్క బీఎంఎస్ తప్ప అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికులను చైతన్యపరిచేలా సమ్మె ఆవశ్యకతను తెలుపుతూ గేట్‌మీటింగ్‌లు, సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, తదితర కార్యక్రమాలను నిర్వహించాం. సింగరేణి, ఎల్ఐసీ, ఆర్టీసీ, డిఫెన్స్ రంగం, బీఎస్ఎన్ఎల్, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు, హమాలీ, భవన నిర్మాణ, స్కీం వర్కర్లు, కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, తదితర రంగాల్లోనూ నూటికినూరు శాతం విజయవంతం చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. బీఎంఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నది.. కార్మికులకు నష్టం జరుగుతుంటే గమ్ముగా ఉంటున్న బీఎంఎస్ అసలు కార్మిక సంఘమేనా?. కార్మికులు సమ్మెవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్షాలు, కాంగ్రెస్, టీఆర్ఎస్, తదితర రాజకీయ పార్టీలన్నీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. మన రాష్ట్రంలో అధికార పార్టీకి అనుబంధంగా పనిచేసే టీఆర్ఎస్కేవీ, తదితర సంఘాలు సమ్మెలో పాల్గొనబోతున్నాయి. రాష్ట్రంలో సమ్మె ముమ్మాటికీ విజయవంతమవుతుంది.