Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నిరంజన్‌రెడ్డి
- ఇథనాల్ తయారీపై కేంద్రం ఎందుకు దృష్టి సారించటం లేదు..?
- ఏప్రిల్ ఒకటి వరకూ ఆందోళనలు.. తీర్మానించి ప్రధానికి పంపుతాం...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఉగాది తర్వాత టీఆర్ఎస్ తరపున ఉధృత ఉద్యమాలు నిర్వహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్రం తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజరుకుమార్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించటాన్ని ఆయన ఈ సందర్భంగాతప్పు బట్టారు. బియ్యం ఎగుమతులను పెంచుకోవటం, ఇథనాల్ తయారీపై దృష్టి సారించటం వంటి వాటిని మోడీ సర్కారు ఎందుకు పట్టించుకోవటం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణను అవమానించిన తవారెవరూ రాజకీయాల్లో బాగుపడలేదని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించకపోవటం శోచనీయమన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరగుతుంటే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో యూపీఏ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడే అదే మోడీ ప్రధానిగా... మన రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటి వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. 'తెలంగాణలో యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనాలంటూ తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని...' ఆయన వివరించారు.