Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 28,29 దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణబంద్లో పాల్గొందాం
- దేశాన్ని కాపాడుకుందాం
- దేశవ్యాప్త కార్మిక సమ్మెకు వామపక్షాల మద్దతు
- నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమ, మంగళవారాల్లో కార్మిక, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్లు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించాయి. జాతీయ సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశాయి. కోవిడ్ సంక్షోభంతో ప్రజానీకం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నదని తెలిపాయి. ఈ నేపథ్యంలో దేశ సంపదను కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అన్ని తరగతుల ప్రజానీకం కదిలి ఈ సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మె సందర్భంగా అన్ని జిల్లాలు, మండలాల్లో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని వారు పిలుపునిచ్చారు.
వామపక్ష పార్టీల డిమాండ్లు :
- రైతు, కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను, లేబర్ కోడ్లను రద్దుచేయాలి. ప్రజావ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును ఆపాలి
- ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ఆపాలి. సహజవనరుల లూఠీ నిలుపు చేయాలి.
- డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను అదుపులో ఉంచి ప్రజానీకాన్ని ఆదుకోవాలి.
- ఉపాధి కోల్పోయిన వారికి జీవనోపాధి పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయాలి.
- ఉపాధి హామీకి బడ్జెట్‌ను పెంచి, 200 రోజుల పని కల్పించాలి. రోజుకు రూ.600ల వేతనం ఇవ్వాలి.
- ఇన్‌కంటాక్స్ పరిధిలో లేని ప్రతి కుటుంబానికీ రూ.7,500లు నగదు ఇవ్వాలి. 10 కేజీల బియ్యం, ఆహార పదార్ధాలు రాబోయే ఆర్నెల్లకు ఉచితంగా ఇవ్వాలి.
- ఆరోగ్య రంగానికి నిధులు పెంచి ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చాలి.
- ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులకనుగుణంగా కనీస వేతనం రూ.21,000లుగా నిర్ణయించాలి.
- ఆర్థిక స్వావలంబన, సార్వభౌమత్వాలకు హానిచేసే దేశ ద్రోహపూరిత విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విడనాడాలి.