Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడే ఆ పార్టీని ఓడించగలం
- ధర్మం.. జాతి పేరిట కాషాయ రాజకీయాలు
- మోడీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ...
- ఎంఐఎం అనేది బీజేపీకి బీ-టీమ్
- అది ముస్లింల ఓట్లు చీల్చుతూ కమలానికి లాభం చేకూరుస్తోంది
- ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర
- విలేకర్ల సమావేశంలో ఆప్ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ భారతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూటమి ఏర్పడితే అది విజయం సాధించబోదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ భారతి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాల ఆధారంగా కూటమిని ఏర్పాటు చేస్తేనే బీజేపీని ఓడించటం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం, జాతి అనే నినాదాల పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తున్నది తప్ప అభివృద్ధికి సంబంధించిన అంశాలేవీ దానికి పట్టటం లేదని విమర్శించారు. ఇందుకు భిన్నంగా తమ పార్టీ అభివృద్ధే అజెండాగా.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకెళుతున్నదని చెప్పారు.
రాష్ట్ర పర్యటనలో ఉన్న సోమనాథ్... ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఆప్ తెలంగాణ ఇన్చార్జి ఇందిరా శోభన్‌తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌తో సహా స్వతంత్ర వ్యవస్థన్నింటినీ బీజేపీ కబ్జా చేసిందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి అదే పనిగా ప్రచారం చేస్తున్న బీజేపీ... వాస్తవానికి అదే కాశ్మీరీ పండిట్ల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. ఆ సినిమా నిర్మాతకు కేవలం డబ్బులు మాత్రమే కావాలి తప్ప మిగతా విషయాలేవీ పట్టబోవని విమర్శించారు. ఆ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరూ ఉచితంగా చూస్తారు కదా..? అని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీల కోసమే ఉన్నామని చెప్పుకునే ఎంఐఎం... కమలం పార్టీకి బీ-టీమ్‌గా మారిపోయిందని అన్నారు. ముస్లింల ఓట్లను చీల్చటం ద్వారా అది బీజేపీకి లాభం చేకూరుస్తున్నదని చెప్పారు. వర్తమాన రాజకీయాల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేది కేవలం ఆప్ మాత్రమేననే సంకేతాలను తమ పార్టీ ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించేందుకు సైతం బీజేపీ వెనుకాడుతోందని అన్నారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవసరం లేకుండానే మూడు మున్సిపాల్టీలను విలీనం చేస్తున్నారని తెలిపారు. తమ తర్వాతి లక్ష్యం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ సర్కారు వాటిని భర్తీ చేయటం లేదన్నారు. ఆప్ హయాంలో ఢిల్లీలో 12 లక్షల ఉద్యోగాలనిచ్చామని వివరించారు. తెలంగాణలో కూడా కుల, మతాల ఆధారంగా రాజకీయాలు చేసేందుకు కొన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయని విమర్శించారు. ఆప్ అందుకు భిన్నంగా 'కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్...' నినాదంతో ఇక్కడ ముందుకెళుతుందని చెప్పారు. ఏప్రిల్ 14న తెలంగాణలో తమ పార్టీ ఆధ్వర్యాన పాదయాత్రను చేపడతామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో కుల, మత రాజకీయాలకు అతీతంగా పంజాబ్ ప్రజలు తీర్పునిచ్చారని సోమనాథ్ ఈ సందర్భంగా వివరించారు.