Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో విద్యార్థి, యువజనులు క్రీయాశీలకంగా పాల్గొనాలని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి,టినాగరాజు(ఎస్ఎఫ్ఐ),కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ (డివైఎఫ్ఐ) ఆదివారం వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో దేశ జీడీపీలో విద్యదకు అతి తక్కువ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు నిధులు లేక,కనీస మౌలిక సదుపాయాలు లేక కునారిల్లుతున్నారని వివరించారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించటంతో మూసివేత దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెలో భాగస్వాములమై నిరసన తెలిపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేవిధంగా కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కారుచౌకగా అమ్మకానికి పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి ఎనిమిదేండ్లవుతున్నా ఉద్యోగ కల్పన లేదని రమేష్, వెంకటేశ్ తెలిపారు. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఎనిమిది లక్షల70వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెంచుతూ, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతున్నదని పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల కనీస హక్కులను కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు కావటం లేదని,పనిభారం పెంచుతున్న నేపథ్యంలో జరగుతున్న సార్వత్రిక సమ్మెలో నిరుద్యోగ యువత పాల్గొనాలని కోరారు.