Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..
- తండ్రిని గొడ్డలితో నరికిన తనయుడు
- తల్లి పరిస్థితి విషమం
నవ తెలంగాణ-దౌల్తాబాద్
భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కక్ష పెంచుకుని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుగా వచ్చిన తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ అమానవీయ సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. దౌల్తాబాద్ ఎస్ఐ చైతన్య కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మైసయ్య, పోశవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. గతంలో చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మిగతా ఇద్దరికీ పెండ్లిలయ్యాయి. పెద్ద కొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. వీరికి చెందిన మూడు గంటల భూమిని అమ్మగా శనివారం రూ.60 వేలు వచ్చాయి. ఆ డబ్బు తనకు ఇవ్వాలని బాలమల్లు శనివారం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తన ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రి ఖర్చులకు కావాలని మైసయ్య కొడుకుతో చెప్పాడు. దాంతో అసహనానికి గురైన కొడుకు బాలమల్లు ఆదివారం ఉదయం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి.. ఆరుబయట గిన్నెలు కడుగుతున్న తల్లి పోచవ్వపై దాడి చేసి తీవ్రంగా చితక బాదాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బుల సంచి లాక్కున్నాడు. అనంతరం బైక్ నుంచి పెట్రోల్ తీసి తల్లిపై చల్లి నిప్పంటించాడు. పోచవ్వ కేకలు వేయడంతో మైసయ్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి పోచవ్వపై దుప్పటి కప్పాడు. ఇది గమనించిన బాలమల్లు గొడ్డలితో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం ద్వారా తండ్రిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోచవ్వను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మైసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.