Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి :
తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
- ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో నిరసన దీక్ష
నవతెలంగాణ-అడిక్ మెట్
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను గడువు పెంచకుండా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన జీవో 317తో పాటు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2020లో సీఎం అసెంబ్లీలో ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేసి అమలు చేయాలన్నారు. వీఆర్ఏల నియమిత డ్యూటీ చార్ట్‌ను నిర్ధారించి నాలుగేండ్లుగా నిషేదంలో ఉన్న సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలని కోరారు. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబంలో అర్హులైన వారికి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చేది జీతం/ కూలి, ఆదాయం కానే కాదనీ, కాబట్టి దాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలన్నారు. 33 నెలల పీఆర్సీ బకాయిలు, 6 నెలల డీఏ ఏరియర్స్‌ను విడుదల చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలనీ, కేవలం శాశ్వత ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్షలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జి.నిర్మల, కోశాధికారి జి.బాలస్వామి, రాష్ట్ర చీఫ్ కన్వీనర్ భోగ శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్లు వేముల రాధికారెడ్డి, రంజిత్, గోవింద్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రాజగోపాల్, సీనియర్ నాయకులు పొన్నగంటి ఆంజనేయులు, జాఫర్‌తోపాటు 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.