Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి కేటాయింపుల అమలుకు కసరత్తు
- లోపాల సవరణకు ప్రయత్నాలు
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, గతంలోని ట్రిబ్యునళ్ల నీటి కేటాయింపులు, ఇతర సమస్యలపై వరుసగా రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న లేఖలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) స్పందించింది. సమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టినట్టుగా సమాచారం. ఇటీవల కేఆర్ఎంబీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) పరిధిలోని ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై పెద్దగా సమస్యలు లేవు. దీంతో దానిపై లేఖలు, ఫిర్యాదులు సర్కారు నుంచి వెళ్లలేదు. అసలు సమస్యంతా కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, ఇటీవల కాలంలో ఏపీ చేస్తున్న కొత్త ప్రాజెక్టుల మూలంగా రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి, ఇటు కేఆర్ఎంబీకి వరుసగా లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్)పై కూడా ప్రత్యేకంగా కేఆర్ఎంబీకి ప్రభుత్వం తరపున రాష్ట్ర సాగునీటి ఆయుకట్టు, అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. పాత ట్రిబ్యునల్ అయిన బచావత్ తీర్పు ప్రకారం నీటి కేటాయింపులు ఉన్నా, అక్కడ లభ్యత లేదనీ, ఉన్న కొద్దిపాటి నీళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఏపీతోపాటు పక్కనున్న కర్నాటక అధికంగా తరలించుకుపోతున్నదనే వివరాలతో సుదీర్ఘంగా లేఖలు రాశారు. అంతేగాక ఏపీ గురు రాఘవేంద్రతోపాటు మరో 13 చిన్నతరహా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టినట్టు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఈనేపథ్యంలో కేఆర్ఎంబీ ఇటీవల పలుమార్లు భేటి అయింది. అటు ఏపీ, ఇటు తెలంగాణతోపాటు కర్నాటక ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను సైతం సమీక్ష చేసినట్టు సమాచారం. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును మరోసారి అధ్యయనం చేసినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో గతంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయింపుల అమలుకు చేపట్టాల్సిన చర్యలపై కేఆర్ఎంబీ దృష్టిపెట్టింది. మూడు రోజుల క్రితం జరిగిన కేఆర్ఎంబీ భేటిలో కృష్ణా జలాల వివాదాలపై చర్చించినట్టు సమాచారం. ఆ సందర్భంగా ఆర్టీఎస్ ఆనకట్ట, హెడ్‌రెగ్యులేటర్‌కు మార్పులు చేయాలనీ, నదీ ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదలచేసినప్పుడు రెండు రకాల విధానాలను అనుసరించాలనీ, మొత్తం వ్యవహారంపై ఆరు నెలల్లో అధ్యయనం చేయాలనీ, ఇందుకు అవసరమయ్యే నిధులను మూడు రాష్ట్రాలు భరీంచేలా ప్రణాళికను సిద్ధం చేసినట్టు సమాచారం. పనులు మాత్రం కర్నాటక సర్కారుతో చేయించేలా ఆదేశాలు జారీచేయనుంది. వచ్చే జూన్ నుంచి తాజా నిర్ణయాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా నీటి నిల్వ, లభ్యత ఆధారంగా వానాకాలం, యాసంగి సీజన్లల్లో ఏ రాష్ట్రానికి ఎంత నీరు అందుబాటులో ఉంటుందో తుంగభద్ర బోర్డు ముందస్తు సమాచారం ఇచ్చేలా కూడా సూచనలు చేసినట్టు అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించి మూడు రాష్ట్రాలకు పంపించడంతోపాటు, దాన్ని అమలుకు పక్కాగా చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ భావిస్తున్నట్టు తెలిసింది.