Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
- డ్వాక్రా గ్రూపులతో సమానంగా వికలాంగ మహిళలందరికీ వడ్డీలేని రుణాలివ్వాలి : ఎన్పీఆర్డీ రాష్ట్ర సదస్సులో వక్తల డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
మహిళా వికలాంగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనీ, డ్వాక్రా గ్రూపులతో సమానంగా వికలాంగ మహిళలందరికీ వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఎన్పీఆర్డీ మహిళా విభాగం రాష్ట్ర సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్ర ంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) మహిళా విభాగం ఆధ్వర్యంలో 'మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు-స్ఫూర్తి అవార్డ్స్' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సదస్సుకు మహిళా విభాగం కన్వీనర్ సి.సాయమ్మ అధ్యక్షత వహించారు.ఈ సదస్సులో శ్రీ ఆకాంక్ష ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్ పి.సంధ్యారాణి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ శారద, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎం. అడివయ్య హాజనై మాట్లాడారు. ముందుగా మహిళా వికలాంగుల సమస్యలపై కో-కన్వీనర్ కె.నాగలక్ష్మి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. దేశంలో 1.18 కోట్ల మంది వికలాంగ మహిళాలున్నారనీ, వీరిలో 36 శాతం మంది అక్షరాస్యులని తెలిపారు. యూఏనీ సీఆర్పీడీలోని ఆర్టికల్ 3,6లలో వికలాంగ మహిళల హక్కులను పొందుపర్చారన్నారు. దేశంలో బాలికల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుందనీ, మహిళలపై వరకట్న వేధింపులు పెరుగుతున్నాయన్నారు. ప్రతి 22 నిమిషాలకు ఒక లైంగిక దాడి, 76 నిమిషాలకు ఒక అపహరణ జరుగుతుందన్నారు. శ్రామిక మహిళలు పని ప్రదేశాల్లో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణలో సుమారు 4 లక్షలకుపైగా మహిళా వికలాంగులున్నారనీ, వారు నిత్యం అనేక వేధింపులు, అవమానాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, జిల్లా స్థాయిలో పరిష్కారం చూపేందుకు న్యాయ సహాయ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. మానసిక వికలాంగులైన బాలికలు 70 శాతం లైంగిక దురాక్రమాలకు గురౌతున్నారని యునెస్కో అధ్యయనం పేర్కొన్నట్టు గుర్తు చేశారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి మహిళా వికలాంగులకు రక్షణ కల్పించలేక పొతున్నాయన్నారు. మహిళా వికలాంగుల్లో అర్హులైన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలనీ,అంగన్వాడీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వికలాంగ మహిళలను వివాహం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలనీ, మహిళా వికలాంగులందరికీ అంత్యోదయ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు.నిరుద్యోగ మహిళా వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, కుటీర పరిశ్రమల అభివృద్ధి ద్వారా మహిళా వికలాంగుల్ని ఆర్ధికంగా ఆదుకోవాలని తెలిపారు.మహిళా వికలాంగులపై పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టాల న్నారు. పెండ్లీలు కాని మహిళ, యువతుల కోసం ప్రభుత్వం హెరీమ్స్ నడపాలనీ, ప్రతి జిల్లా కేంద్రంలో హెరీమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తీవ్ర వైకల్యం గల మహిళా వికలాంగులకు ఉచితంగా బ్యాటరీ, టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయాలనీ, కుట్టు ఎంబ్రాయిడింగ్, కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.రాజు, యశోద, ఆరిఫా, లక్ష్మి, సహాయ కార్యదర్శులు కవిత, ఉపేందర్, దశరథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, షాహిన్ బేగమ్, నజీయా, సావిత్రి, లలిత, మహిళా విభాగం నాయకులు ఉష, బుచ్చమ్మ, ముక్తాభాయి, సుశీలతోపాటు వివిధ జిల్లాల నుంచి మహిళా వికలాంగులు పాల్గొన్నారు.