Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధివిధానాల ఖరారుకు సర్కారు రెడీ
- ఎన్నికల్లోపు నాలుగు లక్షల ఇండ్లు పూర్తి చేసేలా ప్లాన్
- డబుల్ బెడ్ రూమ్ పథకానికి మంగళం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లను చూస్తే పేద ప్రజలను అవమానించే విధంగా ఉంటున్నాయి. కేవలం ఒకే ఒక్క గదిలో భార్య, భర్త, పిల్లలు జీవించాల్సి రావడం ఎంతటి నరకమో ఉహించవచ్చు. ఆ గదిలోనే కోళ్లు, మేకలను కూడా పెంచుకోవాల్సిన దుస్థితిలో పేదలు జీవిస్తున్నారు. కనీసం మహిళలు స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి చిన్నచాటు కూడ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దుస్థితి నుంచి పేద ప్రజలకు విముక్తి కలిగించేందుకు వారికి గౌరవప్రదమైన, నివాసయోగ్యమైన ఇండ్లు కట్టించేందుకు టీఆర్ఎస్ నిశ్చయించింది.ఇల్లులేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో మూడు లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది,స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న (డబుల్బెడ్రూమ్) ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది'
-2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ
'సొంత జాగ ఉన్నవారు డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు'.
-మార్చి 7, 2022న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన విషయం.
దాగుడు మూతలు
రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నది. ఈ పథకం కొనసాగుతుండగానే...మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. పాత పథకం రద్దు అవుతుందనీగానీ, కొనసాగుతుందనీగానీ చెప్పకుండానే సొంత జాగా ఉన్న వారు రెండుగదుల ఇల్లు నిర్మించుకోవడానినికి మూడు లక్షల రూపాయలు అందించనున్నట్టు పేర్కొంది. ఇప్పటిదాకా వీటిపై ఎంతో గొప్పగా చెప్పిన టీఆర్ఎస్ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటున్నదనే సిగల్స్ ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అందుకే జాగా ఉన్న పేదవారికి మూడు లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. అందుకు బడ్జెట్లో రూ 12వేల కోట్లు పెట్టింది.
ఎన్నికలగాలం
డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సర్కారు వ్యయప్రయాసలుపడాల్సి వస్తుంది. పైగా ఇప్పటికే ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ 9వేల కోట్లు అప్పులు చేసింది. నిర్మాణంలోనూ అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పనులు నత్తనడక సాగుతున్నాయి. బిల్డింగ్ మెటీరియల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం గుదిబండగా మారింది. తద్వారా ఆర్థిక భారం ఎక్కువ అవుతున్నది. ఇంత పెద్ద మొత్తంలో నిర్మించినప్పటికీ ఇల్లు ప్రతి నిరుపేదను సంతృపిపరిచే అవకాశం కనిపించడం లేదని భావిస్తున్నది. అందుకే రెండు పడక గదుల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే దీన్నుంచి బయపడేందుకు 'జాగ ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షలు రూపాయలు' ఇస్తామంటూ ప్రకటించింది. రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ పథకాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రతినియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మూడు లక్షల యాబై ఏడువేల ఇండ్లు నిర్మించుకునేందుకు పేదలకు మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. మరో 43వేల ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నది. రానున్న ఎన్నికల్లోపు లబ్దిదారులను గుర్తించడం, వారికి నగదు బదిలీ చేసేలా ఈ పథకాన్ని రూపొదిస్తున్నట్టు సమాచారం. ఈ డబ్బుతో రెండు పడక గదులు నిర్మించుకుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది. అయితే కేవలం మూడు లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతున్నదనే ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారమే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ 5.30 లక్షల ఖర్చు అవుతున్నది. హైదరాబాద్ నగరంలో అయితే ఒక ఇంటి నిర్మాణానికి రూ 9 లక్షల వ్యయమైంది. ఈ క్రమంలో సొంత జాగా ఉన్న వారు అయినా మూడు లక్షలతో ఏ విధంగా రెండుగదుల ఇల్లు నిర్మించుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ మిగతా మొత్తాన్ని బ్యాంకులు అప్పులిస్తాయా?లేదా ఇప్పటికే సొమ్ములున్న వారికే ఇది ఉపయోగపడ్తుందా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.