Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రకటించారు. ఆదివారం శాసనసభ ఆవరణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదనీ, రాష్ట్ర రైతాంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పీయూష్‌గోయల్ దెబ్బతీశారన్నారు. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తాం..యాసంగిలో వరి సాగుచేయండి అని రైతులకు బండి సంజరు హామీ ఇచ్చిన వీడియోలు బయట పెడుతున్నామనీ, దానిపై ఆయన సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు ధాన్యం కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని మాటమార్చడం దారుణమని విమర్శించారు. ధాన్యం ఉత్పత్తి రాష్ట్రంలో 400 రెట్లు పెరిగిందనీ, ఇది కేసీఆర్ రైతు అనుకూల విధానాల వల్ల కాదా అని ప్రశ్నించారు. కేంద్రం పరిధిలోనే ఆహారభద్రత ఉంటుందనే సోయి బీజేపీ నేతలకు లేదా అని నిలదీశారు. గోడౌన్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. బీజేపీ తాను అధికారంలో లేని రాష్ట్రాలపై కక్షగట్టిందని విమర్శించారు. ఒకే దేశం ఒకే సేకరణ విధానం తేవాల్సిందేనని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఇప్పటికే గ్రామపంచాయతీల తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నామని చెప్పారు. రైతులతో పెట్టుకుంటే ఏ పార్టీ బాగు పడదని బీజేపీని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై బండి సంజరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మెతుకు ఆనంద్ మాట్లాడుతూ..రైతులను రెచ్చగొట్టి తమ భాద్యత నుంచి బీజేపీ తప్పించుకుంటున్నదని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే బీజేపీ ప్రభుత్వం పెట్రో బాదుడు మొదలు పెట్టిందన్నారు. బీజేపీ పేదల పాలిట భారీ జలగల పార్టీగా మారిందని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్లపై బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత తమది కాదని ప్రధాని మోడీ బహిరంగంగా ప్రకటిస్తే కేసీఆర్ ఆ బాధ్యతను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ..పీయూష్‌గోయల్‌కు వ్యాపారం తెలుసుగానీ, వ్యవసాయం తెలియదని విమర్శించారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా కేసీఆర్‌ను ఏం చేయలేరని తేల్చిచెప్పారు.