Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ముస్లిం సంఘాల
- జేఏసీ రౌండ్‌టేబుల్ ప్రశ్న
- 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు...
- సీఎం కేసీఆర్‌కు ముస్లిం సంఘాల జేఏసీ రౌండ్‌టేబుల్ ప్రశ్న
- 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముస్లింలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని ముస్లిం సంఘాల జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశం ప్రశ్నించింది. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా, ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం నుంచీ పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 30న జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ముస్లిం సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో 'కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?' అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సమావేశానికి తెలంగాణ యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీంపాషా అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి, రచయిత స్కైబాబ (యూసుఫ్షేక్), తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్, అన్వర్‌ఖాన్ (ఎస్సీఎస్టీ మైనార్టీ ఫోరం), అఫ్సర్జాహ (హమ్ ఫౌండేషన్), సారామాథ్యూ (సామాజిక కార్యకర్త), షాబాజ్ అలీఖాన్ (టీజేఏసీ), ఖరీద్దీన్మౌలానా (సూఫీ ఉలేమా కౌన్సిల్), ముస్తాక్ సాహెబ్, హనీఫ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు దఫాల ఎన్నికల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చేతులు దులుపుకుంటే ఎనిమిదేండ్లుగా నష్టపోయిన అగాధాన్ని ఎలా పూడుస్తారని ప్రశ్నించారు. కేంద్రం అంగీకరించదని అందరికీ తెలుసుననీ, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆక్షేపించారు. 12 శాతం రిజర్వేషన్ ఎనిమిదేళ్లుగా కల్పించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాల్లో ముస్లిం నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుకు జ్యూడీషియల్ పవర్ కల్పించాలనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దాదాపు 7వేల ఎకరాలకు పైగా వక్ఫ్‌భూమి కబ్జాలకు గురైందని ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తుచేశారు. మైనారిటీ కమీషన్, వక్స్ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలకు పూర్తి స్థాయి పాలక మండళ్లను వెంటనే నియమించాలని కోరారు. సుధీర్ కమీషన్ సూచించిన మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం ముస్లిం మైనారిటీకి కేటాయించాలనీ, మైనారిటీ బడ్జెట్‌ను రూ. 5 వేల కోట్లకు పెంచాలని కోరారు. మైనారిటీ బంధు పథకాన్ని అమలు చేయాలనీ, ఉర్దూ మీడియం స్కూల్స్, కాలేజీల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను డీ నోటిఫై చేసి తిరిగి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్టీ-2017లో పెండింగ్‌లో ఉన్న 558 ఉర్దూ మీడియం టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం బోర్డులో పర్మనెంట్ సిబ్బందిని నియమించానీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ముస్లిం మైనారిటీకి అవకాశం ఇవ్వాలని చెప్పారు. యూనివర్సిటీల్లోని వైస్ ఛాన్సలర్ పదవుల్లో ఒక్క ముస్లిం ప్రొఫెసర్‌కు కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కనీసం రిజిస్ట్రార్లు, ఓఎస్డీలుగా అయినా ముస్లిం ప్రొఫెసర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలనీ, కార్పోరేషన్ ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాలను రూ. 10 లక్షలకు పెంచాలనీ, డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో ముస్లింలకు 12 శాతం ప్రత్యేక కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 30న కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలనీ, ఆ ఆందోళనా కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో దాదాపు 40 ముస్లిం సంఘాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.