Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు పెంచిందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆదివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తంగా 850 రకాల మందుల ధరలను భారీగా పెంచేందుకు తయారీ కంపెనీలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం వేసిందని తెలిపారు. రోగులు వాడే మందులపై 2019లో 2 శాతం, 2020లో 0.5శాతం మాత్రమే ధరలు పెంచుకోవడానికి అవకాశమిచ్చిన కేంద్రం... ఏప్రిల్ ఒకటి నుంచి మామూలు జ్వరానికి వాడే మందు బిళ్లలతోపాటు, బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర జబ్బులకు వాడే మందులతోపాటు, 850 రకాల మందులపై 11శాతానికి ధరలు పెంచడం అన్యాయమని పేర్కొన్నారు ఇది సరైందికాదని తెలిపారు. ఇప్పటికే పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్, నూనెలు, విద్యుత్ బిల్లులతోపాటు, నిత్యావసరాల ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. దీనికితోడు ప్రస్తుతం మందుల ధరలు కూడా పెంచడమంటే ప్రజలపై మరింత భారం వేయడమేనని గుర్తు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు, ప్రభుత్వాల ఆదాయం పడిపోయినప్పటికీ కార్పొరేట్ మందుల కంపెనీలు, ఆస్పత్రుల యజమానులు మాత్రం కుబేరులయ్యారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర మందులు రెగ్యులర్గా వాడే పేదలు వైద్యానికి దూరమవుతారనీ, తక్షణమే వాటి ధరల పెంపుదల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజలకు మందుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
సీపీిఐ(ఎంఎల్) న్యూడెక్రమోసీ పిలుపు
దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో కార్మికవర్గం నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఆదివారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ, విదేశీయ, కార్పొరేట్, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను రూపొందించిందని విమర్శించారు. కార్మికవర్గం ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులను అణచి వేస్తున్నదని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వేలు, పోర్ట్లు అన్ని రంగాలను అమ్మేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ధరలను తగ్గిస్తామంటూ చెప్పిన బీజేపీ ప్రభుత్వం...ఎన్నికల ఫలితాలు వెలువడగానే గ్యాస్ పెట్రోల్ డీజిల్, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందని విమర్శించారు. అన్ని రంగాలను ప్రయివేటీకరిస్తూ...దేశాన్ని నిలువునా అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.