Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర కార్మిక సంఘాలు, అఖిలభారత రక్షణ ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన 48 గంటల సమ్మెలో హైదరాబాద్లో రక్షణరంగ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు భారీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఖండించారు. డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, ఆర్సీఐ, ఎంఈఎస్, ఎయిర్ఫోర్స్, ఆర్డినెన్స్(మెదక్) ఫ్యాక్టరీ ఉద్యోగులు,కార్మికులు వేలాదిగా తొలిరోజు సమ్మెలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో ప్రయివేటు రంగానికి బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించడాన్ని ఈసందర్భంగా తప్పుబట్టారు. సంస్కరణల పేరిట దేశరక్షణను పణంగా పెట్టడాన్ని ఖండించారు. ఈడిఎస్ఏకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్మికచట్టాలను సవరించి నాలుగు లేబర్కోడ్లు తేవడాన్ని సహించేది లేదని హెచ్ఛరించారు. రక్షణ రంగ ఉద్యోగులకు 18 శాతం డీఏను వెంటనే చెల్లించాలనీ మోడీ సర్కారును డిమాండ్ చేశారు. సమ్మె నేపథ్యంలో ఆయా సంస్థల వద్ద గేట్మీటింగ్లు, ప్రదర్శనలు భారీగా నిర్వహించినట్టు అఖిలభారత రక్షణ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) జాతీయ సహాయ కార్యదర్శి జీటీ గోపాలరావు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.