Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఆర్సీ చైర్మెన్ రంగారావుకు కాంగ్రెస్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెంచిన విద్యుత్ చార్జీలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయనీ, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ కోరింది. ఈమేరకు సోమవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఈఆర్సీ చైర్మెన్ తన్నీరు రంగారావుకు ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. కార్యాక్రమంలో ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మల్లు రావి, దాసోజు శ్రవణ్, హర్కర వేణుగోపాల్, వివిధ అనుబంధ సంఘాల చైర్మెన్లు ప్రీతమ్, వెంకట్, మెట్టు సాయి కుమార్, అధికార ప్రతినిధి రవళి తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ పాత టారిఫ్ పద్ధతిలోనే విద్యుత్ బిల్లులను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం బకాయి ఉన్న రూ .13 వేల కోట్ల బకాయిలు వెంటనే వసూలు చేయాలని సూచించారు. విద్యుత్‌చార్జీలపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, అందులో చర్చించాలన్నారు. విద్యుత్ సంస్థల అంశంపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోదండరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ సంస్థలకు బకాయిలను చెల్లించామని గుర్తు చేశారు. విద్యుదుత్పత్తి ఉత్పత్తి పెరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాలు టారిఫ్ తగ్గించాయని తెలిపారు. వీటి కోసం నియంత్రణ కమిటీ నియమించాలని కోరారు. మల్లు రవి మాట్లాడుతూ కరెంట్ చార్జీలపై వచ్చే నెల నుంచి ఉద్యమాలు చేయబోతున్నట్టు తెలిపారు.