Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు జిల్లాలకు తప్పిన నీటిఎద్దడి
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదిలిన మూడు శాఖలు
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి
వేసవిలో నీటిఎద్డడి తలెత్తకుండా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించింది. ముందస్తు జాగ్రత్తగా నాగార్జునసాగర్ నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేస్తూ శ్రీశైలంలోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలోని సుమారు ఆరు జిల్లాలకు తాగునీటి ముప్పు తప్పింది. రూ. 42 వేల కోట్లతో ప్రారంభించిన మిషన్‌భగీరథ తాగునీటి ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. 33 జిల్లాలకు మెయిన్పైపులైన్లు, వాటర్ ట్రీట్మెంట్ పాంట్లు, ఓహచ్బీఆర్లు, జీఎల్బీర్లు నిర్మించిన విషయమూ విదితమే. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అలాగే పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పరిశ్రమలకు సైతం పది శాతం నీటిని కేటాయించారు. ఇదిలావుండగా ఈ వేసవిలో తొలినాళ్లల్లో శ్రీశైలంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవని మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి గుర్తించారు. వెంటనే సీఎంవో కార్యదర్శి స్మీతాసభర్వాల్తో చర్చించి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి ఈనెల 23న తీసుకెళ్లారు. అప్రమత్తమైన సీఎం, వెంటనే మిషన్ భగీరథ, జెన్కో, ఇరిగేషన్ అధికారులకు నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలంలోకి నాలుగు నుంచి ఐదు టీఎంసీల నీటిని తరలించేలా ఆదేశాలు జారీచేశారు.దీంతో గత నాలుగు రోజులుగా రెండు టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌లోకి చేరింది. మరో రెండు నుంచి మూడు టీఎంసీలు రానున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు రివర్స్ పంపింగ్ జరగనున్నట్టు మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు వచ్చే ఆగస్టు వరకు నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చే వర్షాలు, రిజర్వాయర్‌లోకి వచ్చే ఇతర వరద నీటితో తాగునీటి సమస్య రాదని అంటున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటితోడివేత ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల ప్రాజెక్టు సలహదారు పెంటారెడ్డి సైతం చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో పిహెచ్-2 పంప్ ద్వారా నీటిని తరలిస్తున్నారు.