Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'శతవసంతాల మాలపల్లి'
- ఆవిష్కరణ సభలో తెలకపల్లి రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వందేండ్ల నాటి భారతీయ సమాజంలోని జీవిత పార్శ్వాలను అన్ని కోణాల్లో వాస్తవికంగా, ప్రామాణికంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించిన నవల 'మాలపల్లి'అని సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఉన్నవ లక్ష్మినారాయణ రచించిన చారిత్రక నవల 'మాలపల్లి'కి వందేండ్లు పూర్తయిన సందర్భంగా సాహితీ ప్రస్థానం మాసపత్రిక ప్రచురించిన 'శతవసంతాల మాలపల్లి' ప్రత్యేక సంచికను విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాసు ఆవిష్కరించారు. సాహితీ ప్రస్థానం మాసపత్రిక ఎడిటర్ సత్యాజీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ..ఉన్నవ రచన 'మాలపల్లి' సంపూర్ణ కథనాన్ని, అన్ని జీవిత పార్శ్వాలను తడిమిందన్నారు. సమగ్రత, పరిణతి, ప్రాతినిధ్యస్వభావం, విమర్శ, వాస్తవికత మేళవించిన దృష్టికోణం వంటి అంశాలను నవల ద్వారా వివరించడం అత్యంత అరుదైన విషయమన్నారు. సమాజ గమనానికి చోదకశక్తులెవరు? పీడక శక్తులెవరు? రాజకీయంగా, సామాజికంగా ప్రగతినిరోధక శక్తులెవరు? ఆ శక్తుల రూపురేఖలను కండ్లకు కట్టిందనీ, నాటి పోరాటాలను చిత్రించి రాబోయే కాలాన్ని వారెలా మార్చబోతున్నదీ దార్శనికంగా సూచించిందన్నారు. స్వాతంత్య్రపోరాటం, సామ్యవాద చైతన్యం, అస్పృశ్యత నిరోధం, స్త్రీల బాధావేదనలను నాలుగు చక్రాలుగా నడిపిన సాహిత్య రథం 'మాలపల్లి' నవల అన్నారు. ఆ నవలలో స్వాతంత్రోద్యమంలో భిన్న శక్తులను, భిన్న భావనలను చూస్తామన్నారు. ఇంతటి ఉన్నత విలువలున్న ఈ నవల నేపథ్యాన్ని ఆచరించాలనీ, చర్చించాలనీ, ఆదరించాలని కోరారు. బి.తులసీదాస్ మాట్లాడుతూ..'మాలపల్లి' వచ్చి వందేండ్లయినా దాని ప్రాసంగితపై సాహితీవేత్తలు, మేధావులతో పాటు ఈ తరం వారు కూడా చర్చించుకోవడం దాన్ని విశిష్టతను చాటిచెబుతున్నదని కొనియాడారు. భవిష్యత్ పరిణామాలను ఊహించి ఉన్నవ ఆనాడే ఈ నవలలో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఇప్పటికీ ఈ నవల అన్ని తరగతుల ఆదరాభిమానాలతో సజీవంగా ఉందన్నారు. సాహితీ ప్రస్థానం ఉపాధ్యక్షులు ఒ.శాంతిశ్రీ వందన సమర్పణ చేయగా..సీనియర్ జర్నలిస్టు జివి.రంగారెడ్డి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.