Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన టీఎస్ఈఆర్సీ చైర్మెన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల్ని వివిధ రూపాల్లో పరిష్కరించుకోవచ్చని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావు తెలిపారు. విద్యుత్ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యల్ని వినియోగదారులు ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చనీ, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తారని వివరించారు. రాష్ట్రంలో సీజీఆర్ఎఫ్పై విద్యుత్ వినియోగదారులకు సరైన సమాచారం లేదనీ, దానిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీజీఆర్ఎఫ్లోనూ పరిష్కారంకాని సమస్యల్ని విద్యుత్ అంబుడ్స్‌మెన్ పరిష్కరిస్తుందన్నారు. అక్కడా సాధ్యం కాకుంటే టీఎస్ఈఆర్సీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. సోమవారంనాడాయన టీఎస్ఈఆర్సీ సభ్యులు ఎమ్డీ మనోహరరాజు (టెక్నికల్), బండారు కృష్ణయ్య (ఫైనాన్స్)తో కలిసి సీజీఆర్ఎఫ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. మోబైల్ఫోన్ ద్వారానే ఫిర్యాదుల్ని నమోదు చేసుకోవచ్చనీ, సీజీఆర్ఎఫ్ విధివిధానాలు, బాధ్యతలు, పరిధి తదితర అంశాలన్నింటినీ త్వరలో తెలుగు భాషలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. డిస్కంలు ఫిర్యాదులపై స్పందించకుంటే వాటిని జరిమానాలు విధించే అధికారం టీఎస్ఈఆర్సీకి ఉన్నదని గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే విద్యుత్ సంస్థల లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీనివాసులు, టీఎస్ఈఆర్సీ కార్యదర్శి ఉమాకాంత్పాండ తదితరులు పాల్గొన్నారు.