Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- వైవీ సంస్మరణ సభలో ప్రముఖుల నివాళ్లు
నవతెలంగాణ-తొర్రూరు
సీపీఐ(ఎం) నాయకులు యనమల వెంకటయ్యను నిఖార్సైన కమ్యూనిస్టుగా, పేదల పక్షపాతిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభివర్ణించారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన యనమల వెంకటయ్య (వైవి) సంస్మరణ సభకు తమ్మినేని వీరభద్రం హాజరై నివాళ్లర్పించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ.. వెంకటయ్య 50 ఏండ్లుగా కమ్యూనిస్టు ఉద్యమంలో విద్యార్థి దశ నుంచి పని చేస్తూ పేదల సమస్యలు, హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహించారని చెప్పారు. వెంకటయ్య స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై సమరశీల పోరాటాలు నిర్మించాలని సూచించారు. ఐక్యఉద్యమాల ద్వారానే ప్రజా, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సమస్యలు పరిష్కారమౌతాయని స్పష్టం చేశారు. ఐక్యపోరాటాలే వెంకటయ్యకు నివాళ్లని చెప్పారు. సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు జి రాములు, బొజ్జ భిక్షమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి విజరుసారధి, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్, ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి, న్యూడెమోక్రసీ నాయకులు ఆలకుంట్ల సాయిలు, సీపీఐ రాష్ట్ర నాయకుడు తమ్మెర విశ్వేశ్వర్రావు, సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు బొల్లం అశోక్, మండల కార్యదర్శి యాకూబ్, వైవీ మిత్రులు చామకూర ఐలయ్య, వల్లపు మల్లయ్య, పసులాది వెంకన్న, మేకల కుమార్, సూర్నపు సోమయ్య, పాపారావు, పెరుమాండ్ల తిలక్ బాబు తదితరులు పాల్గొన్నారు.