Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కార్మికుల నినాదాల హౌరు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''ఆవాజ్ దో...హమ్ ఏక్ హై.., సేవ్ ద పబ్లిక్ సెక్టార్...గోబ్యాక్ మోడీ సర్కార్'' అంటూ విద్యుత్ కార్మికులు నినాదాల హౌరెత్తించారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా రెండ్రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం మింట్ కాంపౌండ్‌లో విద్యుత్‌రంగ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ సౌధతో పాటు జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామసమయంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ, ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో జేఏసీ కన్వీనర్ పి రత్నాకరరావు, చైర్మెన్ జీ సాయిబాబు, కో చైర్మెన్ ఈ శ్రీధర్, కో కన్వీనర్ పి బీసిరెడ్డి, జాయింట్ సెక్రటరీలు వీ గోవర్థన్, డి శ్యాంమనోహర్, ఎమ్ వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.