Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక కోడ్లను రద్దు చేయకుంటే కర్రుకాల్చి వాతపెడతాం
- అవినీతికి మూలం ప్రయివేటీకరణ
- కార్పొరేట్ల ధనంతోనే బీజేపీ గెలుపు
- అందుకే వారికనుగుణంగా పాలన: ఆర్ఎల్సీ కార్యాలయం వద్ద సమ్మె సభలో కార్మిక సంఘాల నేతలు
- వందలాదిగా తరలొచ్చిన కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక కోడ్లను రద్దు చేయకుంటే కార్మికులంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెడతారని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. అవినీతికి మూలం ప్రయివేటీకరణ అనీ, మోడీ సర్కారేమో దానికే పెద్దపీట వేస్తున్నదనివిమర్శించారు. కార్పొరేట్లు తమకొచ్చే లాభాల్లో ఇచ్చే వాటా ధనంతోనే ప్రజల్ని మభ్యపెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే వారికనుగుణంగా పాలన చేస్తున్నదని తెలిపారు. కేంద్ర అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యపోరాటాల ద్వారా అడ్డుకుంటామని ప్రకటించారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కోడ్లను తిప్పికొట్టి హక్కుల్ని కాపాడుకుంటామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాలయం ముందు కార్మిక సంఘాల నగర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో సమ్మె సభను నిర్వహించారు. ఎర్రజెండాలు, ప్లకార్డులు చేతపట్టి వందలాది మంది కార్మికులు తరలొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఏఐయూటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాబూరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ మాట్లాడారు. దేశభక్తి ముసుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ..కార్పొరేట్ల మేలు కోసం తన భక్తిని చాటుకుంటున్నదని విమర్శించారు. దేశభక్తిపేరుతో దేశ సంపదను కాజేస్తున్నదనీ, దీనికి అడ్డువేసేందుకు కార్మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా మోడీ సర్కారు మాత్రం అమలు చేయట్లేదని విమర్శించారు. చట్టాలను, కోర్టులను గౌరవించని మోడీసర్కారు వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేశారనీ, కేంద్రం చేతులెత్తేస్తే కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకుని నడుపిస్తున్నదని చెప్పారు. ఆ రెండు ప్రభుత్వాలకు సాధ్యమైన పని మోడీ సర్కారుకు ఎందుకు కాదని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులను, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మిక కోడ్లను రద్దు చేయకపోతే కార్మికవర్గం కర్రుకాల్చి వాతపెడుతుందని హెచ్చరించారు. ఏడుగురు కార్మికులుంటే సంఘం పెట్టుకోవచ్చనేదాన్ని కాలరాసే హక్కు మోడీ సర్కారుకు ఎక్కడిదని నిలదీశారు. 8 గంటల పనివిధానాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కుట్రను తిప్పికొడతామన్నారు. ఒకే పనిచేసే కానిస్టేబుళ్లు-హోంగార్డులకు, ఆశాలు-నర్సులకు, రెగ్యులర్ ఉద్యోగులకు-కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. కనీసవేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్, సీఐటీయూ నాయకులు కుమారస్వామి, ఆర్.వాణి, టి.పుల్లారావు, రాములు, అశోక్, ఐఎఫ్టీయూ నేత అనురాధ, ఏఐటీయూసీ నాయకులు కె.యాదగిరి, ప్రేంపావని, జ్యోతి, మదన్‌సింగ్, లక్ష్మి, ఐఎఫ్టీయూ నేతలు ఎస్ఎల్ పద్మ, శ్రీనివాస్, కిరణ్, నల్లన్న, హెచ్ఎంఎస్ నాయకులు భాగ్యవతి, మహ్మద్ అంజద్, తదితరులు పాల్గొన్నారు.