Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంభంపాటి 'నేను-తెలుగుదేశం' పుస్తకావిష్కరణలో గవర్నర్ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి
ప్రజాస్వామ్య విలువలు, నైతిక విలువల పరిరక్షణే రాజకీయ నాయకుల కర్తవ్యంగా ఉండాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రచించిన ''నేను-తెలుగుదేశం'' పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని దసపల్లా హొటల్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ, రాజకీయాలు సేవాభావంతో ఉంటాయి తప్ప, వ్యాపారం కాదన్నారు. అవినీతిని చీల్చి చెండాడిన ఎన్టీ రామారావు..తెలుగు రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇచ్చిన ప్రతి వినతికి తక్షణమే చర్యలు తీసుకుని ఫలితం చూపించేవారని గుర్తుచేశారు. వాజ్ పేయి ప్రధానిగా, బాలయోగి లోక్ సభ స్పీకర్‌గా ఉన్న సమయంలో కంభంపాటితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆయన నిబద్ధతతో పనిచేసే వ్యక్తని ప్రశంసించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చి గణనీయమైన మార్పులు తేవాలా..? స్వచ్ఛంద సంస్థ పెట్టి ప్రజాసేవ చేయాలా..? అని ఎన్టిఆర్ కుటుంబ సభ్యుల అభిప్రాయం కోరినప్పుడు.. తాను మొదటిదానినే సూచించానని గుర్తుచేశారు. టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిశానిర్దేశం అయ్యాయన్నారు. ఎన్టీఆర్ ప్రవేశెట్టిన రూ.2కిలో బియ్యం ఈ రోజు ఆహారభద్రతకు దారితీసిందని, మహిళలకు ఆస్తిహక్కు దేశవ్యాప్తంగా అమలవుతోందని చెప్పారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల ద్వారా దేశ రాజకీయాలనే సమూలంగా మార్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని తెలిపారు. అధికారం కోసం ఆరాట పడలేదని,ప్రజాహితం కోసమే తపించానని అన్నారు. తాను చేసిన అభివృద్ధే తనకు ఆత్మతృప్తి ఇచ్చిందన్నారు. తెలుగువారి అభివృధ్ది కోసం టిడిపి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, దీనికి అందరి సహకారం ఉండాలని కోరారు. కంభంపాటి రామ్మోహన్ చిత్తశుద్ది కల కార్యకర్త.. చేపట్టిన ప్రతిపదవికి కంభంపాటి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. స్వలాభం కోసం ఏనాడూ ఆయన ఆరాట పడలేదన్నారు. ఎన్టీఆర్ పర్యటనలు విజయవంతం చేయడం వెనుక కంభంపాటి కష్టం ఉందని చంద్రబాబు ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, ఎక్కడ ఉన్నా ధర్మాన్ని విస్మరించరాదని అన్నారు. సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ, విపి సింగ్‌ను ప్రధానిగా చేయడం వెనుక ఎన్టీఆర్, దేవెగౌడ, గుజ్రాల్‌లను ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకంగా పేర్కొన్నారు. లైజెనింగ్లో కంభంపాటి మార్క్ సాటిలేనిదని అన్నారు. సినీ దర్శకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, రామచంద్రులుగా ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగుదేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పుస్తక రచయిత కంభంపాటి మాట్లాడుతూ, టిడిపిలో మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం లభించడం తనకు గర్వంగా ఉందన్నారు. ఆ అనుభవాలను భావితరాలకు అందించేందుకే ''నేను-తెలుగుదేశం'' పుస్తకాన్ని తెచ్చామన్నారు. 1982 నుంచి నేటి వరకు టిడిపితో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ప్రయోజనార్ధం చేపట్టిన పనులను ఆయన వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, తుమ్మల నాగేశ్వర రావు, కామినేని శ్రీనివాస్, సిపిఐ నేత నారాయణ, మాజీ ఎంపి మురళీమోహన్, టిడిపి నేతలు రావుల చంద్రశేఖర రెడ్డి, పయ్యావుల కేశవ్, కాట్రగడ్డ ప్రసూన, నర్సిరెడ్డి, సినీ నిర్మాత అశ్వనీదత్, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.