Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో 100 శాతం
- బ్యాంకుల్లో నిలిచిన లావాదేవీలు
- స్తంభించిన బీడీ పరిశ్రమ
- పోస్టల్,ఎల్ఐసీ రంగాల్లోనూ జయప్రదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికులు తట్ట ఎత్తలేదు..పార పట్టలేదు. దీంతో అక్కడ వంద శాతం సమ్మె జరిగింది. బీడీ కార్మికుల ఐక్యతతో ఆ పరిశ్రమే స్తంభించిపోయింది. భవన నిర్మాణ కార్మికులు తాపీ పట్టలేదు. సమ్మెలో పాల్గొనవద్దని కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసినా..ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి బ్యాంకులను ప్రయివేటు పరంచేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ బ్యాంకు ఉద్యోగులు కదనరంగంలోకి దూకటంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచాయి. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది విధులు బహిష్కరించారు. మిగతావారూ ఏదోఒక రూపంలో నిరసన తెలిపారు. బంగారుబాతు గుడ్డు లాంటి ఎల్ఐసీ వాటాలను స్టాక్మార్కెట్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు కలిసికట్టుగా సమ్మెలో పాల్గొన్నారు. దేశ ఆయుధ సంపత్తి కర్మాగారాలపై ప్రయివేటు కంపెనీలకు పెత్తనాన్ని నిరసిస్తూ డిఫెన్స్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పోస్టల్ కార్మికులు పూర్తిగా సమ్మెలోకి వెళ్లారు. డోలమైట్, సెయిల్, బీఎస్ఎన్ఎల్, ఇన్‌కమ్‌ట్యాక్స్ తదితర సంస్థల్లో సమ్మె పూర్తిస్థాయిలో జరిగింది. ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ రంగం చాలా మేరకు స్తంభించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ, 490కి పైగా మండలాలు, 52 పారిశ్రామిక క్లస్టర్లు, 140 మున్సిపాల్టీల్లో, వేలాది గ్రామాల్లో సమ్మె ప్రదర్శనలు, సభలు పెద్దఎత్తున జరిగాయి. ప్రయివేటు రంగాల్లోని పరిశ్రమలు అత్యధికంగా మూతపడ్డాయి. హమాలీ, ఆటో, ప్రయివేటు ట్రాన్స్పోర్ట్, ఇతర అసంఘటితరంగ కార్మికులు లక్షల సంఖ్యలో సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ కార్మికులు వేల సంఖ్యలో సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ సమ్మెకు సంఘీభావంగా ఉపాధ్యాయులు, విద్యార్థి, యువజన, మహిళ, ప్రజా సంఘాలు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో సమ్మె సంపూర్ణంగా విజయవంతం కావడానికి సహకరించిన సంఘాలు, రాజకీయ పార్టీలకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ తరపున అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తొలిరోజు సమ్మె విజయవంత స్ఫూర్తితో రెండోరోజు సమ్మెకూ రాష్ట్ర కార్మికవర్గం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
రంగాల వారీగా ఇలా..
6 లక్షల 30 వేల మంది బీడీ కార్మికులు సమ్మెలోకి వెళ్లటంతో ఆ పరిశ్రమ స్తంభించిపోయింది. హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 52 పారిశ్రామిక క్లస్టర్లలోని 5,811పరిశ్రమల్లో కార్మికులు సమ్మె లో పాల్గొన్నారు. 3 లక్షల భవన నిర్మాణ కార్మికులు, 2 లక్షల మంది హమాలీలు, 5 లక్షల 50 వేల మంది ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ కార్మికులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది 76వేల మంది, మధ్యాహ్న భోజన కార్మికులు 43 వేల మంది, అంగన్వాడీలు 24 వేల మంది, ఆశాలు 10వేల మంది,ఐకెపి విఓఏలు 2,391 మంది, పవర్లూమ్ 3,200మంది సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రం లో సుమారు 25 లక్షల మంది సమ్మెలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ నిరసన కార్యక్రమాలు చేశారు. పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఇన్కమ్ ట్యాక్స్ తదితర సంస్థల్లో సమ్మె పూర్తిస్థాయిలో జరిగింది. బ్యాంకింగ్,ఇన్సూరెన్స్ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచాయి. రక్షణరంగ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పారిశ్రామికవాడల్లో భారీ ప్రదర్శనలు
పలు పారిశ్రామిక ప్రాంతాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ.. తదితర సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతంలో తిరుగుతూ కంపెనీలు మూసి వేయించారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామికవాడ సభలో సాయిబాబు పాల్గొని ప్రసంగించారు. జీడిమెట్ల సబ్ స్టేషన్ నుంచి పారిశ్రామిక వాడలో ర్యాలీ, బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్కేవీ నాయకులు కె.పి.వివేకానంద్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి.యూసఫ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి వి.ప్రవీణ్, ఐఎన్‌టీయూపీ జిల్లా అధ్యక్షులు గూడ ఐలయ్య పాల్గొని మాట్లాడారు. మలక్‌పేట్ గంజ్ నుంచి డీమార్ట్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మాటల్లో జాతీయత, దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలను అమలు చేస్తోందన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్ పాల్గొని మాట్లాడారు. బొంతపల్లి, గడ్డపోతారం, ఖాజిపల్లి ఇండిస్టియల్ క్లస్టర్ల కమిటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో పెరిగిన చమురు ధరలను నిరసిస్తూ కొత్తూరు నుంచి షాద్‌నగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని మాట్లాడారు. గండిపేట్, రాజేందర్ నగర్ ప్రాంతాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ బైక్ ర్యాలీలో పాల్గొని పరిశ్రమల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. గండిపేట్ మండలం మణికొండ మున్సిపాలిటీ లాంకో హిల్స్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పెద్ద షాపూర్ పీహెచ్సీ ఎదుట సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ర్యాలీ అగ్రభాగాన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, శ్రీనివాస్ తదితరులు కదం తొక్కారు. కామారెడ్డి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత రం బైపాస్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నేతలు పోతినేని సుదర్శన్‌రావు, బాగం హేమంతరావు, పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బంద్‌కు మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాత ఎల్ఐసీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తోపులాట జరిగింది. నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ టీఎన్జీవోస్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా ధర్నా చౌక్‌కు వెళ్లి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో వివిధ రంగాల కార్మికులు విధులను బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పాల్గొని మాట్లాడారు. భువనగిరి మండలం చీమలకొండూరులో వ్యకాస ఆధ్వర్యంలో గ్రామీణబంద్ నిర్వహించారు. ఆలేరు మండలంలోని సారాజిపేట, మదనపల్లిలో పోస్టుమాస్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. నల్లగొండలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కోదాడపట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజన, పొరస్ కంపెనీ కార్మికులు నిరసన తెలిపి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నూతనకల్ మండలకేంద్రంలోని సూర్యాపేట-దంతాలపల్లి ప్రధానరహదారిపై భారీఎత్తున నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని 'ఆల్ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్' ఉద్యోగులు ప్రధాన కార్యాలయంలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ పాల్గొని మాట్లాడారు. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ) ఖైరతాబాద్ సిగల్ సెంటర్ నుంచి ఆర్టీఏ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి గీతాభవన్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున కార్మిక ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. జగిత్యాల జిల్లాలో కార్మిక సంఘాలు సహా మెడికల్ రిప్రజెంటేటివ్, బీడీ కార్మిక సంఘాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, స్కీం వర్కర్లు పెద్దఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ నిరసనకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. మానకొండూర్ మండలం సదాశివపల్లి జాతీయ రహదారిపై రైస్‌మిల్లు ఆపరేటర్లు ధర్నా చేపట్టడంతో పోలీసులు అరెస్టు చేశారు. సుల్తానాబాద్ మండలంలో రైస్‌మిల్లు ఆపరేటర్లు, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. హుజూరాబాద్‌లో పోస్టల్ ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. సమ్మెకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ శ్రీనివాస్‌యాదవ్ మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఉద్యోగులు డివిజనల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడి కార్మిక సంఘాల నిరసనకు మద్దతు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో సారత్రిక సమ్మె సక్సెస్ అయ్యింది. సీఐటీయూ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసరా ర్యాలీలు నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఆటోలు నడవ లేదు. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు వెలవెలాబోయాయి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. రిమ్స్, ఎల్ఐసీ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తొలిరోజు 22వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు గనుల వద్ద నిరసన తెలిపి సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీలో ఐకాసగా ఏర్పడిన తొమ్మిది సంఘాల కార్మికులు విధులకు వెళ్లకపోవడంతో కొన్ని బస్సులు రోడ్డెక్కలేదు. వనపర్తి జిల్లా కంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మండల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించి, తెలంగాణ చౌరస్తా వరకూ ర్యాలీ చేశారు.
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణి గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు విధులకు హాజరు కాలేదు. దాంతో సింగరేణి ప్రాంత బొగ్గు బావులు, ఓపెన్‌కాస్టులు బోసిపోయాయి. సింగరేణిలోని 20 ఓపెన్ కాస్ట్ గనులు, 26 భూగర్భ గనుల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులకు పెద్ద సంఖ్యలో విధులకు హాజరు కాకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తి తీవ్ర విఘాతం ఏర్పడింది. దాదాపు లక్షా యాభైవేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నష్టపోయినట్టు సమాచారం.గని ఆవరణ లోనికి కార్మిక సంఘాల ప్రతినిధులు రాకుండా పోలీసులు,సింగరేణి సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించారు.రక్షణ సిబ్బంది వ్యవహార శైలితో కార్మికులకు రక్షణ సిబ్బందికి వాదోపవాదా లు జరిగాయి. ఈ సందర్భంగా సింగరేణిలో కార్మికులు సమ్మెను విజయవంతం చేసినందుకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐఎప్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్, ఐ.కృష్ణ, ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు తదితరులు కార్మికులకు విప్లవాభినందనలు తెలియజేశారు.