Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిపోయిన పేదరికం
- దేశాన్ని తాకట్టుపెడుతున్న బీజేపీ
- దాన్నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకే సమ్మె :
- ఐసీఇయూ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్ దళ్ తదితర శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు రెండు రోజుల సార్వత్రిక సమ్మె జరుగుతున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజైన సోమవారం హైదరాబాద్లోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఇయూ) అధ్యక్షులు ఎన్.అధీష్ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడలను ఆహ్వానిస్తూ దేశ రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్న హిందుత్వ శక్తులు ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టజూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే సార్వత్రిక సమ్మె జరుగుతున్నదన్నారు. కరోనా తదనతంరం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఆదాయ పన్ను చెల్లించే వారికే అంటూ పేదలకు సాయాన్ని బీజేపీ విస్మరించిందన్నారు. వామపక్ష పార్టీలు భాగస్వామ్యంగా ఉన్న యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ చట్టంతో గ్రామాల్లో పేదలకు ఉపాధి లభిస్తుందన్నారు. దాన్ని ప్రోత్సహించకపోగా బీజేపీ 25 శాతం నిధులను తగ్గించిందని విమర్శించారు. కార్మిక సంఘాలు, హక్కులు, యూనియన్ల చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాలకు ఎసరు పెడుతున్నదని తెలిపారు. నాలుగు కోడ్ల రూపంలో మహిళలకున్న మెటర్నిటీ బెనిఫిట్ రద్దు, రాత్రి వేళల్లో పని చేయించేలా తదితర దుర్మార్గ చర్యలకు పాల్పడుతుందన్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల పోరాటానికి ఆయన మద్ధతు తెలిపారు.
శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ పోరాటంతోనే ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. రాజస్థాన్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీంను రద్దు చేసేందుకు వీలుగా పాత పెన్షన్ స్కీంను తెచ్చిందని తెలిపారు. అదే విధంగా ఛత్తీస్ఘడ్ సీఎం ఎల్ఐసీలో ఐపీఓను వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇదంతా కూడా ఉద్యోగులు, కార్మికులు చేసిన, చేస్తున్న ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. దేశంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఐసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటు పరం కానివ్వమని హెచ్చరించారు. భారతీయ జీవిత బీమా సంస్థ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాలసీ హౌల్డర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఐపీఓ ద్వారా షేర్లలో 10 శాతం పాలసీ హౌల్డర్లను యజమానులు మారుస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నదన్నారు. మరి మిగిలిన 90 శాతం మంది డివిడెండ్లు కూడా తగ్గిపోతాయి కదా? అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ప్రయివేటు చేయాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. వెంటనే క్లాస్ 4, క్లాస్ 3 నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
కె.వేణుగోపాల్ మాట్లాడుతూ ఎల్ఐసీలో ఐపీఓకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్ర అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టారనీ, కేంద్రం ఎల్ఐసీని ఎందుకు ముట్టుకుంటున్నదంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారని గుర్తుచేశారు. బీజేపీ సర్కారు ఇచ్చిన రాయితీలతో కార్పొరేట్లు ఎల్ఐసీలో షేర్లు కొంటారనీ, అంటే ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసి వారు లభాపడేందుకు షేర్లు ఉపయోగపడతాయని విమర్శించారు. పోరాటాలతోనే ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలుగుతామని తెలిపారు. ఉద్యమ ఫలితంగానే వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదనీ, నాలుగు కార్మిక కోడ్ల అమలను వాయిదా వేశారనీ తెలిపారు. సమావేశంలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సూర్యం, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు సూజాత, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు శారద, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.తిరుపతయ్య ప్రసంగించారు.
సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయంలో....
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రభుత్వ రంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని అతిపెద్ద పది కార్మిక సంఘాలు, సంఘటిత, అసంఘటిత రంగాలు, స్వతంత్ర ఉద్యోగ సంఘాలు సమిష్టిగా ఇచ్చిన పిలుపులో సికింద్రాబాద్ ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలోనూ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు వి.రమేష్, ఎస్సీజడ్ఐఇఎఫ్ ప్రధాన కార్యదర్శి టీ.వీ.ఎన్.ఎస్. రవీంద్రనాథ్ , నాయకులు ప్రసంగించారు. సికింద్రాబాద్ డివిజనల్ ఐసీఇయూ అధ్యక్షులు ఎమ్.ఎన్. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.రఘు, ఉపాధ్యక్షులు ఏ.రాధారాణి, సంయుక్త కార్యదర్శులు ఎస్.గుణశేఖర్, జి. శ్రీకాంత్, కోశాధికారి ఎన్.సి. అనురాధ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.