Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థలోకి మరో రిటైర్డ్ ఐపీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు
- సెస్‌ల పేరుతో టిక్కెట్‌పై రూ.10 అదనంగా బాదుడు
- ప్రయాణీకులపై ఏటా 1,800 కోట్ల భారం
- కొత్తగా ఇన్ఫర్మేషన్ సెస్ ప్రతిపాదన
- హైదరాబాద్‌లోనూ టోల్‌చార్జీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సు గమ్యంలేని రూట్లలో ప్రయాణిస్తోంది. ఆదాయం కోసం ప్రయాణీకులపై అదనంగా ఏమేం భారాలు వేయోచ్చో మేథోమధనం చేస్తోంది. రోజువారీగా పెరుగుతున్న డీజిల్ భారం ఆర్టీసీకి గుదిబండగా మారింది. ఆ భారాన్ని భరించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వీసీ సజ్జనార్, చైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్థన్‌ను నియమించి సర్కారు చేతులు దులుపుకుంది. సంస్థ మనుగడను పూర్తిగా వారి చేతుల్లో పెట్టి...'నీట ముంచినా...పాలముంచినా మీదే భారం' అన్నట్టు వదిలేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్...బడ్జెటేతర సహాయం అంటూ రూ.3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2022-24 ఆర్థిక సంవత్సరానికి సంస్థకు రీయింబర్స్మెంట్, ప్రభుత్వ గ్యారెంటీ రుణాల చెల్లింపుల కోసం కేవలం రూ.1,500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీనితో సర్కారు నుంచి తమకు ఎలాంటి సహకారం లభించదని సంస్థ ఎమ్డీ, పాలకమండలికి స్పష్టత వచ్చేసింది. టిక్కెట్ మూల చార్జీలను పెంచాలనే ప్రతిపాదనా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దానికీ గ్రీన్ సిగల్ లభించలేదు. ఇక లాభంలేదనుకున్న మేనేజింగ్ డైరెక్టర్ కేంద్రప్రభుత్వం తరహాలోనే 'సెస్'ల పేరుతో ప్రయాణీకులపై భారం వేసేందుకు నిర్ణయాలు తీసేసుకున్నారు. చిల్లర సమస్యల, చార్జీల హేతుబద్ధీకరణ పేరుతో టిక్కెట్లను రూ.5-10 డినామినేషన్లలోకి మార్చేశారు. ఫలితంగా టిక్కెట్ రేట్లు పెరిగాయి. దీన్ని బేస్ చేసుకొని బస్‌పాస్ ధరలను రూ.200 నుంచి రూ.500 వరకు పెంచేశారు. అక్కడితో ఆగకుండా గతం ప్యాసింజెర్ సెస్ ఒక్క రూపాయి ఉండేది. దీన్ని ఐదు రూపాయలకు పెంచారు. టోల్గేట్ చార్జీని ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా రెండు రూపాయలు పెంచారు. చిత్రంగా టోల్ చార్జీని హైదరాబాద్ సిటీ బస్సులకూ వర్తింపచేశారు. దీనితోపాటు కొత్తగా సేఫ్టీ సెస్ పేరుతో మరో రూపాయి భారం మోపారు. టిక్కెట్ మూల ధరను పెంచకుండానే వివిధ పేర్లతో ఒక్కో ప్రయాణీకుడిపై కనిష్టంగా రూ.10 భారం మోపారు. ఆర్టీసీ బస్సుల్లో రోజువారీగా దాదాపు 55 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తారని అంచనా. అంటే నెలకి దాదాపు రూ.150 కోట్లు చొప్పున ఏడాదికి రూ.1,800 కోట్ల భారం ఆర్టీసీ ప్రయాణీకులపై పడుతున్నదని రవాణారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో టీఎస్ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలనే కార్మిక సంఘాల డిమాండ్‌ను పట్టించుకోని ప్రభుత్వం దొడ్డిదారిలో ఈ తరహా భారాలు మోపుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కార్మికుల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను యాజమాన్యం తోసిపుచ్చలేదు. అవసరమైన చోట్ల దాన్ని అమలు చేస్తామని స్వయంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రకటిం చడం గమనార్హం. ఉన్న బస్సులకు జీపీఎస్ సిస్టం అమలు చేస్తూ ఇన్ఫర్మేషన్ సెస్ పేరుతో మరో రూపాయి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించిన ట్టు తెలిసింది.అలాగే రూట్లు, సర్వీసుల కుదింపు అంశం కూడా చర్చనీయా ంశంగా ఉంది. కొత్త బస్సులు కొనకుండా, ఉన్న బస్సులతోనే లాభాలు ఆర్జించడం ఎలా అనే దానిపైనే యాజమాన్యం దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.
కొత్తగా రిటైర్డ్ ఐపీఎస్...
తాజాగా ఈ తరహా విధాన నిర్ణయాల అమలు కోసం టీఎస్ఆర్టీసీలోకి మరో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌కు కీలకబాధ్యతలు అప్పగిస్తూ సోమవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రిటైర్ట్ ఐపీఎస్ అధికారి డాక్టర్ వీ రవీందర్‌ను టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు.
ఈ పోస్టు ఆర్టీసీలో లేదు. కేవలం సదరు రిటైర్డ్ ఐపీఎస్ కోసమే సృష్టించినట్టు సమాచారం. ఎమ్డీ తీసుకొనే కీలక నిర్ణయాల అమలు బాధ్యత సదరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారిదేనని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. దానితో పాటు సంస్థలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హెచ్ఓడీలు, రీజినల్ మేనేజర్లకు మధ్య ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, ఎమ్డీ తీసుకొనే నిర్ణయాలకు అనుసంధానకర్తగా పనిచేస్తారు. ఆయనకు దాదాపు రూ.1.10 లక్షల నెలజీతం ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.