Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి చేసి హత్య చేశారని అనుమానాలు..?
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
నవతెలంగాణ-పూడూరు
మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిచిట్టెంపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక (15) ఉదయం 5 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది సేపటికి గ్రామానికి చెందిన వ్యక్తి అటుగా వెళ్తుండగా అమ్మాయి అరుపుల శబ్దం రావడంతో అక్కడికి వెళ్లి చూసే సరికి అమ్మాయి పడి ఉన్న ప్రాంతం నుంచి ఓ వ్యక్తి పరుగెడుతూ కనిపించాడు. ఏమైందని వెళ్లి చూడగా అప్పటికే బాలిక మృతిచెంది ఉన్నది గమనించాడు. వెంటనే ఆ విషయాన్ని మృతురాలి తల్లికి చెప్పాడు. తల్లిదండ్రులు వచ్చి పరిశీలించగా గాయాలతో మృతిచెంది ఉండటాన్ని గమనించారు. వెంటనే గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని చంగముల్ ఎస్ఐ శ్రీశైలం పరిశీలించారు. ఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్పీ కోటిరెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటరామయ్య ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల్లి నుంచి వివరాలు సేకరించారు. అదే గ్రామానికి చెందిన నాని తరుచూ తమ కూతురికి ఫోన్ చేసి వేధించేవాడని, తనపై అనుమానం ఉందని పోలీసులకు మృతురాలి తల్లి తెలిపింది. లైంగికదాడి చేసి, హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలాన్ని డాగ్ స్కాడ్‌తో తనిఖీ చేశారు. అనుమానితులను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకొని వివరాలను మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు చేసిన అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు చెప్పారు.
కాగా, యువతిని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.