Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మటమా..? సిగ్గు.. సిగ్గు..
- ధరలను అదుపు చేయలేని సర్కార్ డౌన్..డౌన్
- వామపక్షాల ర్యాలీలో హోరెత్తిన నినాదాలు
- ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన సమస్త ప్రజాణికం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాదు
మోడీ సర్కార్ ముర్దాబాద్ అంటూ హైదరాబాద్లోని నారాయణ గూడ చౌరస్తా వామపక్షాల నినాదాలతో మిన్నంటింది. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మటమా? సిగ్గు..సిగ్గు., పెరుగుతున్న నిత్వాసర ధరలను అదుపు చేయలేని ప్రభుత్వమా దిగిపో.. సేవ్ ఇండియా..సేవ్ పబ్లిక్ రంగం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా స్లోగన్స్ మార్మోగాయి. ఏన్నో ఏండ్ల పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని హరిస్తే..సహించం., విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి, లేదంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలతో కూడిన ప్ల కార్డులను నాయకులు, కార్యకర్తలు ప్రదర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నారాయణగూడ ప్లైఓవర్ సెంటర్లో సోమవారం సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర నాయకులు ఈ టి నర్సింహ, ఎన్డీ నాయకులు ఝాన్సీ, సంధ్య, ప్రజాపంథా నాయకులు అన్మేశ్ ,ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు తెగనమ్ముతున్నదని విమర్శించారు. ఆ విధానాలు దేశప్రయోజనాలకే ప్రమాదకరమని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించేచర్యలకు ఆ పార్టీ పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల, రైతుల,సమస్త ప్రజల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న చర్యలకు నిరసనగా దేశభక్తియుత సార్వత్రిక సమ్మెకు ప్రజల మద్దతు పెద్ద ఎత్తును వస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో కార్మికులు, కర్షకులు,ఉద్యోగ వర్గాలు,ఇతర తరగతుల ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని చెప్పారు. ఎవరి బతుకులకూ భద్రత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను దేశీయ, విదేశీయ, కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కార్మికవర్గం ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న హక్కులను అణచి వేస్తున్నదని చెప్పారు. బీఏస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, రైల్వే, పోర్టులు తెగనమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటిపండుపడ్డట్టుగా ఇప్పటికే అనేక భారాలు మోస్తున్న ప్రజలపై గ్యాస్, పెట్రోలు, డీజిల్, వంటనూనె, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచిందని విమర్శించారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న నరేంద్ర మోడీ సర్కార్.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ నినాదంతో ఉద్యమిస్తామని చెప్పారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా ఉండేది వామపక్షాలే నని తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగాన్ని అమ్మటమంటే..దేశంకంటే, ప్రజల కంటే కార్పొరేట్లను ఈ ప్రభుత్వం ఎక్కుగా చూస్తున్నదనే విషయం విదితమవుతున్నదని వివరించారు.కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు, కె. గోవర్ధన్, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ , ఎఎస్యూసీఐ(సీ) కార్యదర్శి మురారి, ఎంసీపీఐ(యు) కార్యదర్శి గాజర్ల రవి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి రాజేశ్, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
హోరెత్తిన నినాదాలతో ర్యాలీ..
నారాయణ గూడ ప్లైఓవర్నుంచి కాచిగూడ చౌరస్తావరకు వామపక్ష కార్యకర్తలు ఎర్రజెండాలు చే బూని మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దారిపోడవునా నినాదాలతో హోరెత్తించారు.