Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్సీపీఎస్ఈయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి మంత్రి కేటీ రామారావు అధ్యర్యంలో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్సీపీఎస్ఈయూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్సీపీఎస్ఈయూ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసే వరకు కేటీఆర్ అధ్యక్షతన పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నిరుద్యోగికి గందరగోళ పరిస్థితి లేకుండా ప్రతి నోటిఫికేషన్‌కు నోటిఫికేషన్‌కు మధ్య రెండు నెలల వ్యవధి ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలపై ఉందని కోరారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకూ కలిపి ఒకే మొత్తంలో ఫీజు నిర్ణయించి రిజిస్ట్రేషన్ సమయంలోనే తీసుకోవాలనీ, యూనిక్ ఐడీ నెంబర్‌ను కేటాయించాలని సూచించారు. అర్హత గల అన్ని పరీక్షలకూ అనుమతి ఇచ్చేలా చూడాలనీ, ఉన్నత స్థాయి ఉద్యోగాలు భర్తీ అయిన తర్వాత దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.