Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం అడ్డుకుంటే అప్పుడు అడగండి :
- సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే గిరిజన రిజర్వేషన్ పెంపు జీవోను ఈ రోజు సాయంత్రానికి తీసుకుని రమ్మనండి. కేంద్రం అడ్డుకుంటే అప్పుడు అడగండి. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకుంది' అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకర్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సైన్స్‌సిటీకి 25 ఎకరాల భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాస్తే స్పందన లేదనీ, మూడేండ్ల కింద వరంగల్‌కి సైనిక స్కూల్‌ని మంజూరు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం వల్లనే గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ గుజరాత్‌కి వెళ్లిందన్నారు. దాని బ్రాంచ్ని హైదరాబాద్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన సంస్థలను సద్వినియోగం చేసుకోవాలనీ, రానివాటి కోసం కలిసి ప్రయత్నం చేద్దామని సూచించారు. కేసీఆర్ యాదాద్రికి ఆహ్వానించకపోయినా పర్వాలేదనీ, తాము తర్వాత వెళ్లి దర్శించుకుంటామని చెప్పారు. కేసీఆర్‌కు హుజురాబాద్ ఓటమి తర్వాతనే ధాన్యం కొనుగోలు అంశం గుర్తుకొచ్చిందనీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో చేసినా ఏమీ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో పక్కనున్న ఏపీ రాష్ట్రానికి రాని ఇబ్బంది కేసీఆర్‌కే ఎందుకు వస్తున్నదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి చివరి గింజ వరకూ కొంటామని స్పష్టం చేశారు. గతంలో నిర్దేశించిన టార్గెట్ కూడా కేసీఆర్ ఇవ్వలేకపోయారని విమర్శించారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో జాతీయ జంతు వైద్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామనీ, దాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మాన్సుక్ ఏప్రిల్ రెండో తేదీన మాండవ్య ప్రారంభిస్తారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు అది గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ఆ సంస్థలో పూర్తిగా జంతు సంబంధింత పరిశోధనలే జరుగుతాయని చెప్పారు. దక్షిణాసియా, మన దేశంలో ఇదే తొలి సంస్థ అన్నారు. ప్రస్తుతం వరంగల్‌లో రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తామనీ, వాటిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు.