Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రయివేటీకరణ విడనాడాలి
- బీఎస్ఎన్ఎల్ భవన్ ఎదుట ఉద్యోగుల ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు 5జీ సేవల్ని అందివ్వాలని ఆ సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసేలా కేంద్రం విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదనీ, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ టెలికం సర్కిల్ ఆధ్వర్యంలో రెండ్రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా మంగళవారంనాడిక్కడి బీఎస్ఎన్ఎల్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్ కార్యదర్శి జీ సాంబశివరావు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎమ్ సునీల్‌కుమార్, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డీ శంకర్, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. వేతన సవరణ చేయాలనీ, నేషనల్ పైప్‌లైన్ మానిటైజేషన్ రద్దు చేయాలనీ, ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలనీ, పెన్షన్ సవరణ అమలు చేయాలనీ, బీఎస్ఎన్ఎల్ పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలనీ నినాదాలు చేశారు. ప్రభుత్వరంగ నిర్వీర్య కుట్రలకు బీఎస్ఎన్ఎల్ను కేంద్రం బలిచేసిందనీ, ఇది ఇతర ప్రభుత్వరంగాలకు ఓ హెచ్చరిక అని చెప్పారు. ప్రభుత్వోద్యోగులంతా ఐక్యంగా ప్రజలతో మమేకమై తమ తమ శాఖల్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ విధ్వంసంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.