Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత చట్టాలను పునరుద్ధరించాలి
- కార్మికశాఖ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దశాబ్దాల కాలంపాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్యాయమని తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, నిర్మాణరంగ స్వతంత్ర వృత్తి సంఘాల కమిటీలు తేల్చిచెప్పాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం వారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని టంగుటూరి అంజయ్య కార్మిక శాఖ భవనం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సీడబ్ల్యూఎఫ్ఐ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, బీఓసీ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్‌కుమార్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) జీ అనురాధ, ప్రగతిశీల కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ), టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు కామెల్ల ఐలయ్య, స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం ఎస్ కుమార్, సెంట్రింగ్ కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఎండీ చాంద్‌పాషా, ఐఎన్టీయూసీ చంద్రశేఖర్, బీసీడబ్ల్యూఏ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి పీ పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్త రెండ్రోజుల సార్వత్రిక సమ్మెలో తామంతా భాగస్వాములం అయినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో సామాన్య ప్రజానీకం అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1996 భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమగ్ర చట్టం, 1998 సెస్సు చట్టం, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాలను పోరాడి సాధించుకున్నామని గుర్తుచేశారు. భవన, నిర్మాణ రంగ కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న ఈ చట్టాలను కేంద్రప్రభుత్వం కార్మిక కోడ్లలో కలిపేసిందని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌గా మార్చేశారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ, పార్లమెంటులో కనీస చర్చ లేకుండా కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను ఏకపక్షంగా ఆమోదింపచేసుకున్నదని విమర్శించారు. నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలను నియంత్రించి, జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల వల్ల భవన నిర్మాణాలు తగ్గి ఉపాధి దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ అడ్వయిజరీ బోర్డును పునరుద్ధరించాలనీ, ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలనీ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల పెన్షన్ స్కీంకు కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలనీ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.