Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పౌర స్పందన వేదిక : రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందించాలని, అది ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని మధురానగర్ కాలనీలోని బ్రహ్మం టాలెంట్ స్కూల్ ఆవరణలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేకసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని అభ్యుదయ సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ రూపాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం క్రమంగా ప్రయివేటీకరణ వైపు తమ విధానాలు కొనసాగిస్తున్నాయని, ఇది సరైంది కాదని అన్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ పరిస్థితులవల్ల ప్రయివేటు వైద్యం అత్యంత ఖరీదుగా మారిందన్నారు. ప్రభుత్వ వైద్య సౌకర్యాలు సరిపోకపోవడం, ప్రభుత్వం తగిన సేవలు అందించలేకపోవడం వల్ల అనేక మంది మధ్య తరగతి ప్రజలు ప్రయివేటులో వైద్యం కోసం తమ ఆస్తులు అమ్ముకున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రయివేటు పాఠశాలలో అధిక ఫీజులు చెల్లించినా విద్య సరిగ్గా అందకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యం కోసం, పౌరుల మేలుకోసం ప్రజా స్పందన వేదిక పనిచేస్తుందన్నారు. జిల్లా, మండల వేదికలో పనిచేయటానికి,బాధ్యత గల ప్రతి ఒక్కరూ,యువకులు, పౌర స్పందన వేదికలో చేరవచ్చని,అందుకోసం 9490300678, 9490300580 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రాధేశ్యాం, నాయకులు సీహెచ్ చంద్రశేఖరరావు, వి.రామకృష్ణ రావు, పి.వెంకట్ రెడ్డి, పీ.మస్తాన్రావు, ఎమ్. పాపారావు, పి.సుబ్బారావు, గంగాధర్ రెడ్డి, వి.రాంబాబు, ఎం. శిరీష, ఎన్.సాక్షి రత్న తదితరులు పాల్గొన్నారు.