Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల జీవితాల్లో సమూల మార్పే లక్ష్యం
- ఆస్పత్రుల డైట్ కాంట్రాక్టుల్లో 56 ఆస్పత్రులు ఎస్సీలకు కేటాయింపు
- డ్రా తీసిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళితుల జీవితాల్లో సమూల మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రభుత్వాస్పత్రుల పారిశుధ్య, భద్రత, డైట్ కాంట్రాక్ట్ ఏజెన్సీల్లో 16 శాతం ఆస్పత్రులను ఎస్సీల కోసం డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు కేవలం డబ్బులు పంచే కార్యక్రమం మాత్రమే కాదనీ, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కన్న కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో ఎస్సీ ఎస్టీలకు 21 శాతం కేటాయించారని గుర్తు చేశారు. వైన్ షాపుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయడంతో 300కు పైగా షాపుల యజమానులయ్యారన్నారు.
దళితులకు రిజర్వేషన్ కేటాయించేందుకు ప్రభుత్వాస్పత్రులను రెండు కేటగిరీలుగా విభజించామన్నారు. మొదటి కేటగిరీలో వంద పడకల లోపు ఆస్పత్రులు, రెండో కేటగిరీలో వంద పడకల పైన ఆస్పత్రులున్నాయని వివరించారు. డ్రా తర్వాత 56 ఆస్పత్రులు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు.
వీటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామనీ, ఎస్సీలు అందిపుచ్చుకునేలా నిబంధనల్లో మార్పు చేశామనీ, ఒక్క టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఒక్కో బెడ్డుకు ఇచ్చే ఛార్జీలను పెంచి ఏడాదికి రూ.325 కోట్లు అదనంగా ఖర్చు చేశామని తెలిపారు. అదే విధంగా డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశామన్నారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు.
రిజర్వ్ చేయబడ్డ ఆస్పత్రులివే...
రాష్ట్రంలో వందలోపు బెడ్లున్న ఆస్పత్రులు 122 ఉండగా అందులో 40 ఆస్పత్రులను రిజర్వ్ చేశారు. వంద బెడ్లకు పైగా ఉన్న ఆస్పత్రులు 53 ఉండగా అందులో 16 హాస్పిటళ్లను కేటాయించారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఆస్పత్రుల్లో కరీంనగర్ జిల్లా ఆస్పత్రి, హైదరాబాద్ జిల్లా ఆస్పత్రి (కింగ్ కోఠి), మహబూబ్ నగర్, సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రున్నాయి.
మంత్రి హరీశ్ రావు చొరవతో....
మంత్రి హరీశ్ రావు చొరవతో ఏజెన్సీల్లో దళితులకు రిజర్వేషన్లు కేటాయించారని తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అంబేద్కర్ కలను సాకారం చేయలేదనీ, సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని తెలిపారు.
డిక్కీ హర్షం
ప్రభుత్వాస్పత్రుల కాంట్రాక్ట్ ఏజెన్సీల్లో దళితులకు రిజర్వేషన్లు కేటాయించడం పట్ల దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (డిక్కీ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిక్కీ ఎంఎస్ఎంఇ విభాగం నాయకులు కె.రవికుమార్, పి.మునీందర్, శ్రీరామ్ ఆనంద్, పరమేశ్, మూల, కేపీ శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, రాజేష్, మీడియా కో ఆర్డినేటర్ కాశప్ప, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.