Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లను నమ్ముకున్న మోడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'దేశాన్ని ఓ తేడా సర్కారు పాలిస్తున్నది. ఒకనాడు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ప్రభుత్వాలను చూసినం. కానీ..నేడు ప్రభుత రంగాన్నంతా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్న సర్కారును చూస్తున్నా'మని వక్తలు విమర్శించారు. మోడీ ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజైన మంగళవారం హైదరాబాద్లోని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎల్ఐసీని రక్షించుకుంటామని నినాదాలు చేశారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సభకు యూనియన్ అధ్యక్షులు అదీష్రెడ్డి అధ్యక్షత వహించగా బెఫీ ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఏడేండ్లుగా దేశ ఆర్థివ్యవస్థ దిగజారుతున్నదని చెప్పారు. స్వదేశీ విధానాన్ని, నిత్యం దేశభక్తి గురించి వల్లించే బీజేపీ ప్రభుత్వం, ప్రజల ఆస్తులను, పబ్లిక్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఆకర్షణీయ నినాదాలు, భావోద్వేగాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టడంపై ఉన్న శ్రద్ధ, ప్రజల మౌలిక అవసరాలను తీర్చటంలో లేదని తెలిపారు. కార్పొరేట్ శక్తులే సంపద సృష్టిస్తున్నారని సిగ్గు ఎగ్గు లేకుండా దేశ ప్రధానే చెబుతున్నాడంటే ఈ ప్రభుత్వం ప్రయాణం ఎవరి వైపో అర్థం చేసుకోవచ్చన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైపు లైన్ ద్వారా మరింత వినాశకర విధానాలను తీసుకువస్తున్నదని విమర్శించారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మిక వర్గం చరిత్రలో ఈ 21వ సమ్మె మైలురాయిగా నిలుస్తున్నదని చెప్పారు. ఉద్యోగుల నుంచి మొదలుకుని సామాన్య ప్రజల వరకు సుమారు 20కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం సమ్మె సక్సెస్ కావటమంటేనే ప్రభుత్వ విధానాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సమ్మెను దేశభక్తియుత సమ్మెగా అభివర్ణించారు. కుహనా దేశభక్తులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.తిరుపతయ్య మాట్లా డుతూ ఐపీఓల ద్వారా వాటాల ఉపసంహరణకు కేంద్ర తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలున్నప్పటికీ వాటిని నింపటం లేదని చెప్పారు. ఆదాయ పన్ను పరిమితులలో మధ్యతరగతి ఉద్యోగులకు ఏ మాత్రం వెసులుబాటు కల్పించకుండా కేంద్రం ఏకపక్ష వైఖరిని అనుసరిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బీఎస్ రవి, కెఎస్ రాజశేఖర్, టి శ్రీనివాసులు, టి సుజాత, శ్రీనివాసన్, రవికాంత్, ప్రకాశ్, బిక్షమయ్య మాట్లాడారు.