Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన ఇనుము,సిమెంట్ ధరలు
- టన్నుపై రూ.20-30వేల అదనపు భారం
- సిమెంట్ బస్తాపైనా రూ.30-50 వరకు పెంపు
నిలిచిపోయిన గృహనిర్మాణాలు
నవతెలంగాణ నల్లగొండ
కూడబెట్టుకున్న డబ్బులతో సొంత ఇల్లు కలను సాకారం చేసుకుందామన్న సామాన్యులకు ప్రస్తుతం ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులతోపాటు వివిధ రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముడిసరుకులు, నూనె ధరలు పెరిగిపోయాయి. దాంతోపాటు సిమెంటు, స్టీలు ధరలూ భారీ పెరగడంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఒక నెలలోనే స్టీలు క్వింటాల్‌కు రూ. 8 వేలకు పైగా చేరుకోవడంతో సాధారణ ప్రజల ఇండ్ల నిర్మాణం చేయాలంటేనే భయపడుతున్నారు.
గత నెల క్రితం స్టీలు క్వింటాలుకు రూ. 6500లు ఉంది. ప్రస్తుతం క్వింటాల్ స్టీలుకు ధర రూ. 8,400 నుంచి రూ. 8,600 వరకు చేరింది. దీంతో ఇంటి నిర్మాణ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. 10 వేలు సైతం దాటే అవకాశం లేక పోలేదని వ్యాపారస్తులు అంటున్నారు. ధరలు పెరుగుదలతో నల్లగొండలో చాలామంది నిర్మాణాలు సైతం నిలిపి వేశారు. కొందరు ఇంటి పని చేసే వాళ్లకు ఇప్పటికే స్లాబు వేసుకోవడానికి డబ్బులు చెల్లించారు. ఈ ధరలు పెరగడంతో స్టీలు కొనలేని పరిస్థితులు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వ్యవసాయదారులు, చిన్న, సన్నకారు రైతులు రెండు పంటలు పూర్తయిన తర్వాత తమ పంటలను విక్రయించి వచ్చిన డబ్బులతో నిర్మాణాలు మొదలుపెట్టారు. వచ్చిన దిగుబడితో తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ 25 రోజుల నుంచి ముఖ్యంగా స్టీలు ధర అదనంగా రూ. 2500 పెరిగింది.ఇలా అయితే సొంతిల్లు ఎలా కట్టుకోగలమని చెబుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు తక్కువ ధరకు ఇల్లు నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు సైతం ఇంటి యజమానికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
తగ్గిన దూకుడు....
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ సమయంలోనూ నిర్మాణ రంగం ఊపు మీదున్నది. ఒకవైపు బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు కొత్తకొత్త బహుళ అంతస్తుల ప్రారంభించడంతోపాటు సామాన్యులు సైతం సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో నిమగమయ్యారు. గృహ రుణ వడ్డీరేట్లు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. నిరుడు అక్టోబర్‌లో మొదలైన స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదల రెండు, మూడు నెలల పాటు కొనసాగింది. మధ్యలో సిమెంట్ ధరలు కాస్త తగ్గినా.. ఉక్కు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే నో-స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఆగిపోతున్నాయి.
స్టీల్, సిమెంట్ ధరలు పరుగులు పెడుతున్నాయి
జనవరి నుంచి స్టీల్, సిమెంట్ ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ ధరలు పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దీని ద్వారా భవన నిర్మాణాలు ఆగి పోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టీల్, సిమెంట్ ధరలు తగ్గితే.. నిర్మాణరంగం మరింతగా పుంజుకునే అవకాశముంది.
- రాంరెడ్డి. కార్మికుడు
ఇల్లు కట్టలేని పరిస్థితి..
సామాన్యుడు ఇల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది.పెరిగిన స్టీల్ సిమెంట్ ధరలతో అర్థాంతరంగా నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చింది. స్టీల్ ధర ప్రస్తుతం రూ.8400 దాటింది. సిమెంట్ ఒక బస్తా ధర రూ.400 దాటింది. ధరల పెరుగుదలకు ప్రభుత్వాలు కల్లెం వేయలేక పోతున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. సామాన్యులకు స్టీల్, సిమెంట్ ధరలు అందుబాటులోకి తీసుకురావాలి.
- దండెంపల్లి సత్తయ్య,
తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి