Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో కొట్లాటేది?
- ప్రతి గింజ కొనాలి : రాహుల్ ట్వీట్
- టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు వెల్‌లోకి రండి
- రాహుల్‌కు కవిత ట్వీట్
- మీ ఎంపీలు సెంట్రల్హాల్లో కాలక్షేపం : రేవంత్ కౌంటర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్న తరుణంలో ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేయడం కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. అందులోనూ ఆయన తెలుగులో చేసిన ట్వీట్ పార్టీ ఇమేజ్ పెంచుతున్నదని భావిస్తున్నారు.'తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. తెలంగాణలో రైతుల చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది' అంటూ ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్...రాహల్ ట్వీట్ తమకు నైతిక బలాన్ని ఇచ్చిదంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ ట్వీట్‌పై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి స్పందించారు.'తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు' తెలిపారు. ఇదే క్రమంలో రాహుల్ ట్వీట్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో ట్వీట్ చేశారు. 'మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు మరో నీతా' అంటూ ప్రశ్నించారు. కవిత ట్వీట్‌కు రేవంత్‌రెడ్డి కౌంటరిచ్చారు. 'టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం లేదు, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు.మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది' అని కౌంటర్ ఇచ్చారు. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారా? అని పేర్కొన్నారు.
వరి కొనాల్సిందే.. పోస్టర్ ఆవిష్కరించిన మహేశ్‌కుమార్‌గౌడ్
'వరి కొనాల్సిందే' అనే నినాదంతో గ్రామ గ్రామాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదతరులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ అధికార అహంకారంతో రాహుల్ ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు.