Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రెండోరోజూ సక్సెస్
- చైతన్యం ప్రదర్శించిన సింగరేణి కార్మికులు
- హైదరాబాద్‌లో ఎల్ఐసీ ఉద్యోగుల ప్రదర్శనలు
- కార్మికశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు
- జిల్లాల్లో ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడిలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సార్వత్రిక సమ్మె తెలంగాణలో కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్ పోరాటాలకు దిక్సూచిగా నిలిచింది. సమ్మెను జయప్రదం చేసినందుకు కార్మిక సంఘాల జేఏసీ(సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, ఐఎఫ్టీయూ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు) శ్రామికలోకానికి విప్లవాభివందనాలు తెలిపింది. కార్మిక కోడ్లు రద్దయ్యేదాకా..ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ చర్యలను ఆపేదాకా తమ పోరు కొనసాగుతుందని కార్మికలోకం స్పష్టం చేసింది. సమ్మెతోనే ఆగబోమని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు.. కార్పొరేట్లకు ఊడిగం చేసే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు మునుముందుకే పోతామని తేల్చిచెప్పింది. రెండో రోజూ రాష్ట్రంలో సమ్మె విజయవంతమైంది. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు మొదటిరోజు ప్రదర్శించిన చైతన్యపటిమనే రెండోరోజూ కొనసాగించారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమ స్తంభించింది. నాలుగు బొగ్గుబ్లాకుల ప్రయివేటీకరణకు నిరసనగా సింగరేణి బొగ్గుగని కార్మికులు మొదటిరోజు వంద శాతం పాల్గొనగా..రెండో రోజూ అదే తరహాలో తమ నిరసనలు తెలిపారు. ఎల్ఐసీ ఉద్యోగులంతా తమ ఐక్యతను ప్రదర్శించారు. 'ఎల్ఐసీని రక్షించుకుంటాం..పాలసీదారులకు అండగా ఉంటాం...దేశాన్ని కాపాడుకుంటాం' అంటూ హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌ను ముట్టడించారు. వరుసగా రెండోరోజూ పోస్టల్ ఉద్యోగులంతా మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్లారు. ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్నభోజనకార్మికులు, హమాలీలు, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు కూడా తమ హక్కుల కోసం పోరుబాటలోనే నడిచారు. రాష్ట్రంలో 565 కేంద్రాల్లో దాదాపు 13 నుంచి 14 లక్షల మంది దాకా పాల్గొన్నట్టు అంచనా. బ్యాంకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ ఆయా బ్యాంకుల ఉద్యోగులు రెండోరోజూ సమ్మెలో పాల్గొన్నారు. డోలమైట్, బీఎస్ఎన్ఎల్, ఇన్‌కమ్‌ట్యాక్స్ తదితర సంస్థల్లో సమ్మె పూర్తిస్థాయిలో జరిగింది. ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ రంగం కొంతమేర స్తంభించింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప్రదర్శనలు, కలెక్టరేట్ల ముట్టడిలు జరిగాయి. ప్రయివేటు రంగాల్లోని పరిశ్రమలు అత్యధికంగా మూతపడ్డాయి. రెండో రోజు సమ్మెకు మద్దతుగా జిల్లాల్లో వామపక్షపార్టీలు పలు కార్యక్రమాలు చేపట్టాయి. నిరసన ప్రదర్శనలు, సభలో వామపక్ష నేతలతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆయా పార్టీల నేతలు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.