Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామనే సీఎం కేసీఆర్ హామీ మేరకు ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకనుగుణంగా అధికారులు కసరత్తులు షురూ చేశారు. ఈ నేపథ్యంలో ఏయే శాఖల్లో ఎంతెంతమంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారో తెలపాలంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇతర శాఖలను ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ సూచించారు. 2016 ఫిబ్రవరి 26న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే రోజు అందుకు సంబంధించిన మెమోను కూడా విడుదల చేసింది. అయితే క్రమబద్ధీకరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ పిటిషన్ను 2021 డిసెంబర్ ఏడున హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. మరోవైపు 80 వేలకు పైగా కొత్త ఉద్యోగాల భర్తీతో పాటు 11వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో 2016లో జారీ చేసిన జీవోనెం.16కు అనుగుణంగా అర్హులైన వారి ప్రతిపాదనలు పంపాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సూచించారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల జీవోనెం.16 అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, ఉన్నత విద్య కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ చైర్మెన్ కనక చంద్రం వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.