Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21,22న లాసెట్
- 26,27న ఎడ్‌సెట్
- 29 నుంచి పీజీఈసెట్
- షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో యూజీ, పీజీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మీడియాతో మాట్లాడారు. జులై 21న (మూడేండ్ల ఎల్ఎల్బీ) లాసెట్, 22న (ఐదేండ్ల ఎల్ఎల్బీ) లాసెట్, పీజీలాసెట్ జరుగుతాయని వివరించారు. అదేనెల 26,27 తేదీల్లో ఎడ్‌సెట్, 27,28 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తామని వివరించారు. జులై 29 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హత, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో నోటిఫికేషన్ల ఆయా సెట్ల కన్వీనర్లు ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తారని అన్నారు. ఈ ప్రవేశ పరీక్షల తేదీలు ఇతర పరీక్షలు ఒకే రోజు ఉంటే ఈ తేదీలను మార్చుతామన్నారు. దరఖాస్తు ఫీజును పెంచలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్ రాతపరీక్షల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం విద్యార్థులకు జులై 14,15 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు 18,19,20 తేదీల్లో ఎంసెట్ రాతపరీక్షలు జరుగుతాయి. జులై 13న ఈసెట్ నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. గతేడాది ఐసెట్‌కు 56,962 మంది రాస్తే 51,316 మంది అర్హత సాధించారు. పీజీఈసెట్‌కు 18,274 మంది హాజరు కాగా, 16,582 మంది అభ్యర్థులు అర్హత పొందారు. మూడేండ్ల లా కోర్సుకు 21,160 మంది రాయగా, 14,017 మంది, ఐదేండ్ల లా కోర్సుకు 5,793 మంది హాజరైతే 3,846 మంది అర్హత సాధించారు. పీజీలాసెట్‌ను 2,676 మంది రాస్తే, 2,535 మంది అర్హత పొందారు. ఎడ్‌సెట్‌కు 34,185 మంది హాజరైతే 33,683 మంది అభ్యర్థులు అర్హత పొందారు.
పరీక్ష తేదీ సెట్ విశ్వవిద్యాలయం
జులై 21 లాసెట్ (మూడేండ్ల కోర్సు) ఉస్మానియా
జులై 22 లాసెట్ (ఐదేండ్ల కోర్సు)
జులై 22 పీజీలాసెట్
జులై 26,27 ఎడ్‌సెట్
జులై 27,28 ఐసెట్ కాకతీయ
జులై 29 నుంచి పీజీఈసెట్ ఉస్మానియా
ఆగస్టు 1 వరకు
జులై 14 నుంచి 20 వరకు ఎంసెట్ జేఎన్టీయూహెచ్
జులై 13 ఈసెట్