Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కడే వైద్య విద్యకు అవకాశమివ్వండి...
- 'ఉక్రెయిన్'పై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా దేశానికి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని ఇక్కడే కొనసాగించేందుకు అనుమతినివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్రాన్ని కోరారు. అందుకనుగుణంగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి మంగళ వారం ఆయన లేఖ రాశారు. ఉక్రెయిన్ విద్యార్థులకు సంబంధించి మానవీయ కోణంలో ఆలోచించాలని సీఎం ఈ సందర్భంగా కోరారు. ప్రత్యేక కేసుగా పరిగణించాలని పేర్కొన్నారు, యుద్ధం కారణంగా దాదాపు 20 వేలకు పైగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి వచ్చారని గుర్తు చేశారు. వీరందరూ దేశ వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లో చదువుకునేలా నిబంధనలు సడలించి అవకాశమివ్వాలని కోరారు. విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారున్నారని తెలిపారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో తల్లిదండ్రులు వారి పిల్లలను వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ పంపించారని వివరించారు. వారి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులు భారత్లోనే వైద్యవిద్యను కొనసాగించేందుకు వీలుగా సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో ఈ సారికి పెంచాలని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారని తెలిపారు. విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు వారికయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ వివరించారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.